ములుగు బంద్ విజయవంతం
-
స్వచ్ఛందంగా సహకరించిన విద్యా, వాప్యార సంస్థలు
-
జాతీయ రహదారిపై రాస్తారోకో
ములుగు : ములుగును జిల్లా చేయాలంటూ జిల్లా సాధన సమితి, టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపారులు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ సంస్థలను స్వచ్ఛందం గా మూసివేశారు. జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆస్పత్రి ముందు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. అంతకు ముందు విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో విరమింపజేశారు. అంతకుముందు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ములుగును సమ్మక్క–సారలమ్మల పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏ అర్హత ఉందని భూపాలపల్లి ఓపెన్ కాస్టు ఏరియాను జల్లా చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు ములుగు నియోజకవర్గానివి అయినప్పుడు ఇక్కడి వనరులను వాడుకుంటున్న వేరే ప్రాం తాలను జిల్లాలుగా చేసి ములుగును విస్మరిం చడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి చింతనిప్పుల బిక్షపతి, జిల్లా కార్యదర్శి ముసినేపల్లి కుమార్‌గౌడ్, జవహర్, సర్పంచ్ అల్లెం బుచ్చయ్య, నూనె శ్రీనివాస్, పైడిమల్ల శత్రజ్ఞుడు, బాలుగు చంద్ర య్య, నర్సయ్య, స్వామినాథన్, న్యూడెమోక్రసీ నాయకులు చెట్టబోయిన సారయ్య, గుగులోతు సమ్మయ్య, రమేశ్, నర్సింహస్వామి, కృష్ణ, చిన్న పాల్గొన్నారు.
రెండోరోజూ కొనసాగిన దీక్ష
ములుగును జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి, టీడీపీ ఆధ్వర్యంలో మం డల కేంద్రంలోని గాంధీ చౌక్ ముందు నాయకు లు చేపడుతున్న ఆమరణ దీక్ష మంగళవారం రెండవ రోజుకు చేరింది. దీక్షలో జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్, టీడీ పీ జిల్లా కార్యదర్శి కవ్వంపల్లి సారయ్య, ఎండి. మునీంఖాన్, వైఎస్సార్ సీపీ నాయకుడు కలువాల సంజీవ, కనకం దేవదాస్ కూర్చున్నారు.