
విధుల నుంచి తొలగించారని..
పారిశుధ్య కార్మికురాలి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: పారిశుధ్య విధుల నుంచి తొలగించారంటూ మనస్తాపానికి గురైన గర్భిణి ఆత్మహత్యకు యత్నించిన ఘటన హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో కలకలం రేపింది. హైదరాబాద్ గాజులరామారం శ్రీరాంనగర్‌కు చెందిన పి.సంపూర్ణ(26) పదేళ్లుగా మున్సిపల్ కార్మికురాలిగా పని చేస్తోంది. ఇటీవల పారిశుధ్య కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆమెను విధుల నుంచి తొలగించారు. సోమవారం కార్యాలయానికి వెళ్లి వచ్చిన సంపూర్ణ తీవ్ర మనస్తాపానికి గురైంది. మధ్యాహ్నం ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయడంతో బంధువులు షాపూర్‌నగర్‌లోని రామ్ ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల గర్భిణి అయిన సంపూర్ణ పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అయితే ఉద్యోగం పోయి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆమెకు జవాన్‌గా పనిచేసే ఓ వ్యక్తి నీ ఉద్యోగం నేనే తీయించా.. నీ స్థానంలో మరొకరిని పెట్టుకున్నాం.. అంటూ బెదిరిం పులకు దిగడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఏఐటీయూసీ నేత ఏసురత్నం, ఐఎఫ్‌టీయూ ప్రవీణ్, సీఐటీయూ లక్ష్మణ్, లింగస్వామి, బాల రాజు, కాంగ్రెస్‌నేత గుబ్బల లక్ష్మినారాయణలు సంపూర్ణకు మద్దతుగా ఆస్పత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించి వైద్య పరీక్షల ఖర్చంతా గ్రేటర్ అధికారులే భరించాలని డిమాండ్ చేశారు.
ఎవరిని పెట్టుకోలేదు: ఉప కమిషనర్ మమత
పారిశుధ్య పనులు నిర్వహించే 28 మందిని ఉన్నతాధికారుల సూచన మేరకు విధుల్లోకి తీసుకోలేదని, ప్రతి రోజు తన దగ్గరకు సంపూర్ణతో పాటు తొలగించిన కార్మికులు వస్తున్నారని కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ మమత ‘సాక్షి’కి తెలిపారు. వారి స్థానంలో కొత్త వారిని పెట్టుకోలేదన్నారు. ఈ విషయాన్ని వారికి కూడా చెప్పామని వెల్లడించారు.