సెల్‌ఫోన్ కోసమే హత్య
అదే సెల్‌ఫోన్ నిందితుడిని పట్టించింది
హత్యకేసును ఛేదించిన పోలీసులు
అత్తాపూర్(రాజేంద్రనగర్): హత్య కేసులో నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 9న అత్తాపూర్ పెద్ద తాళ్లకుంట చెరువు వద్ద నర్సింగ్(40) అనే వ్యక్తి హత్య చేయబడ్డ విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫోన్ ఆధారంగా దర్యాప్తు..
మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం, ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడు నగరంలోని గుడ్డిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన ఎస్.నరేష్(38)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నర్సింగ్‌కు రోజూ కల్లు తాగే అలవాటు ఉండడంతో 9వ తేదీన హైదర్‌గూడ కల్లు కాంపౌండ్‌కు వెళ్లాడు. కల్లు తాగుతుండగా నిందితుడు నరేష్ నర్సింగ్‌ను చూసి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ దొంగిలించాలని పథకం వేశాడు. నర్సింగ్ వద్దకు వెళ్లి ఇంకా కొద్దిగా కల్లు తాగించి పక్కనే ఉన్న తాళ్లకుంట చెరువు వద్ద గల ఈదమ్మ దేవాలయం వద్దకు తీసుకెళ్లాడు.
అర్ధరాత్రి దాటిన అనంతరం నిందితుడు నర్సింగ్ వద్ద నుంచి డబ్బులు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా నర్సింగ్ ప్రతిఘటించాడు. దీంతో కోపంతో నరేష్ అతడి తలపై బండరాయితో కొట్టి హత్య చేసి అతడి జేబులో ఉన్న రూ. 500, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. మరుసటి రోజు మృతుడి సెల్‌ఫోన్‌తో నరేష్ తన బంధువులకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఎస్సై వి.ఉమేందర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.