డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా?
అనంతపురం న్యూసిటీ: అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్, రవాణా అనుమతి, మీకు డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా అంటూ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్, హెల్త్ కేర్ ప్రొవైడర్ల (ఎన్‌ఏబీహెచ్) బృందం సభ్యులు డాక్టర్ ప్రశాంత్ కేల్కర్, డాక్టర్ బీనమ్మ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లను ప్రశ్నించారు. శనివారం వారు సర్వజనాస్పత్రిలో తనిఖీలు కొనసాగించారు. ఆస్పత్రిలోని వివిధ వార్డులతో పాటు, కేన్సర్ యూనిట్, ఆస్పత్రి వెనుక వైపు ఉన్న డంప్‌యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్లతో మాట్లాడారు. రోగులను తరలించేటప్పుడు తప్పక రవాణాశాఖ నియమాలను పాటించాలని ఆదేశించారు.
వ్యర్థాలు ఎక్కపడితే అక్కడ వేస్తే ఎలా?
ఆస్పత్రి వెనకున్న డంప్‌యార్డు, వార్డులలో వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూసి కేంద్ర బృందం సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేస్తే ఎలాగని హెచ్‌ఓడీలను ప్రశ్నించారు. సురక్షిత ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పొరపాటున ఇన్‌ఫెక్షన్స్ సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. లేబర్, గైనిక్, చిన్నపిల్లల వార్డులలో ఒక మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులుండడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. కేంద్ర బృందం వెంట సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథం, ఆర్‌ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ విజయమ్మ, హెచ్‌ఓడీలు డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ శంషాద్‌బేగం, నర్సింగ్ సూపరింటెండెంట్లు షాహిదాబేగం, స్వర్ణలత, తదితరులున్నారు.