నీరు–చెట్టు... అంతా కనికట్టు!
ప్రతిపాదనలు ఒక చోట.. పనులు మరొక చోట
జిల్లాలో మంజూరు ....చేసింది చిత్తూరు భూభాగంలో..
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు
టీడీపీ నాయకుల అండతో యథేచ్ఛగా దోపిడీ
రాయచోటి రూరల్: అధికారపార్టీ నాయకుల అండదండలతో నీరు–చెట్టు పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కనికట్టు చేస్తున్నారు. వారి దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోతోందని పలువురు రైతులు వాపోతున్నారు. జిల్లాలో కాంట్రాక్టు పనులు చేసుకుని జేబులు నింపుకొనేందుకు సరైన కాలువలు, నదులు లేవన్న కారణంగా అధికార పార్టీ నాయకుల అండతో పలువురు చోటా నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి, చిత్తూరు జిల్లా పరిధిలో పనులు చేసి బిల్లులు పెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఇష్టారాజ్యంగా పనులు
చిన్నమండెం మండలానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పాలేటమ్మ ఆలయం ఎదురుగా ఉన్న పాలేటమ్మ చెరువు నుంచి చిత్తూరు జిల్లాలో ఉన్న పందిపిర్ల వంక వరకు దాదాపు మూడు పనులు, ఒక్కొక్క పనికి రూ.5లక్షలతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ మొత్తం పనులు 10 మీటర్ల వెడల్పుతో 3కిలోమీటర్ల మేర చేయాల్సి ఉంది. అధికారులు కేటాయించిన పాలేటమ్మ చెరువు–పందిపిర్ల వంకలో ఆ మేరకు భూభాగం లేకపోవడంతో కాంట్రాక్టర్లు చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం పసలవాండ్లపల్లె గ్రామ భూభాగంలో ఉన్న సర్వే నంబర్లు 488 మొదలుకొని, 489, 490, 491, 531, 279/1లలో ఉన్న మాండవ్యనదిలో పనులు చేశారు. ఇందులో మొత్తం 200 మీటర్ల వరకు మాత్రమే జిల్లా భూభాగం కాగా, మిగిలిన భూ భాగం అంతా చిత్తూరు జిల్లా పరిధిలోనిది కావడం విÔó షం.
చెరువుకు నీరు రావాలంటే కష్టమే
కాంట్రాక్టర్లు జేబులు నింపుకునేందుకు ఇష్టారాజ్యంగా పనులు చేశారు. కానీ చేసిన పనులు 3కిలోమీటర్ల మేర జరిగినా, మరో ఒకటన్నర కిలోమీటరు దూరంలో పాలేటమ్మ చెరువు ఉంది. చెరువుకు నీరు రావాలంటే ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న సప్లై ఛానల్‌లో పనులు చేయాల్సి ఉంది. కానీ ఈ విషయం అటు అధికారులకు, ఇటు కాంట్రాక్టర్లకు పట్టడం లేదు. దీంతో చెరువుకు నీరు అందడం కష్టమేనని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.
ఒక దెబ్బకు రెండు పిట్టలు..
పెట్టేవాడు మన వాడే అయితే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అన్నట్లు ఉంది చిన్నమండెం మండల పరిధిలో అధికార పార్టీ నాయకుల తీరు. మండల పరిధిలోని నేరేలవంక– మోటకట్ల రోడ్డు మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల దూరంలో రూ.3లక్షలతో మట్టి రోడ్డు వేస్తున్నారు. దీంతో పాటు రోడ్డు పక్కనే ఉన్న సప్లై చానల్‌లో నీరు–చెట్టు పనులు కూడా రూ.4 లక్షల వ్యయంతో చేస్తున్నారు. ఇంకేముంది కాలువలో మట్టితీయడం, రోడ్డుపైనే పరచడం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కూడా అవసరం లేకుండానే రెండు పనులూ జరిగిపోతున్నాయి. కాంట్రాక్టర్లే పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇదీ టీడీపీ నాయకుల హవా. ఈ వ్యవహారం అంతా చూస్తే నీరు–చెట్టు పనులు కేవలం అధికార పార్టీ నాయకులకు, వారి అండదండలున్న చోటా నాయకుల జేబులు నింపేందుకు మాత్రమే అన్న విషయ ఇట్టే అర్థమైపోతోంది.
జేఈ ఏమంటున్నారంటే..
మీరేమో పాలేటమ్మ చెరువు– పందిపిర్ల వంకలో నీరు చెట్టు పనులు చేశారంటున్నారు.. కాంట్రాక్టర్లేమో చిత్తూరు జిల్లా భూభాగంలోని మాండవ్య నదిలో నీరు–చెట్టు పనులు చేశారని ఇరిగేషన్ జేఈ జగదీశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మాండవ్యనదిలో పనులు చేయలేదని, ఇప్పుడు అక్కడ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం మాండవ్యనదిలో పనులు చేశారని, మళ్లీ ప్రతిపాదనలు ఏమిటని జేఈని అడగ్గా.. పనులు చే సి ఉంటే దానికి కూడా బిల్లులు పెడతామంటూనే, మాండవ్య నదిలో పనులు చేసినట్లు తనకు తెలియదన్నారు. చేసిన పనులకు కొలతలు తీసుకున్నారా ? అని అడగ్గా కొన్ని పనులకు మాత్రం తీసుకున్నామన్నారు.