రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యవర్గం
విజయవాడ(ఆటోనగర్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. విజయవాడ పటమటలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యానమందిరంలో చింతలూరి సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం ఈ ఎన్నికలు నిర్వహించారు. 13 జిల్లాల నుంచి విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ నాయకులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఎన్నికల అధికారులుగా బదిర శంకరనాథ్, ఎ.నాగవీరభద్రాచారి, వసుధ బసవేశ్వరరావు వ్యవహరించారు. అధ్యక్షుడిగా లక్కోజు శ్రీనివాస చటర్జీ, ప్రధాన కార్యదర్శిగా గొర్రిపాటి ప్రభాకరవిశ్వకర్మ, కోశాధికారి మేడేపి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు లక్కోజు శ్రీనివాస చటర్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర అసోసియేషన్ ద్వారా లబ్ధిచేకూరేందుకు, విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమం కోసం సహకరించేందుకు ఈ సంఘం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి అభివద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. రానున్న కాలంలో రాష్ట్ర కమిటీ పూర్తిగా ఏర్పాటు చేసుకుని అసోసియేన్ బలోపేతం చేసి సభ్యుల సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు. అసోసియేషన్‌లో 13 జిల్లాలకు ఒక్కొక్క ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు ఇచ్చామని వివరించారు.