‘స్మార్ట్’గా వేటు!
- కొత్త రేషన్‌కార్డులు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు
- ప్రజాసాధికార సర్వే ప్రభావం
- జిల్లాలో 3,700 కార్డుల తొలగింపు
అనంతపురం అర్బన్ : ప్రజాసాధికార సర్వే (స్మార్ట్ పల్స్) విషయంలో పేదలు భయపడినట్లే జరుగుతోంది. నాలుగు చక్రాల వాహనం, సొంత ఇల్లు... ఇలా వివిధ కారణాలతో కార్డుల తొలగింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా మంజూరైన బీపీఎల్ కార్డులపై తొలి దశలో ‘స్మార్ట్’గా వేటువేసింది. కొత్త కార్డులు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేసింది. లబ్ధిదారుల ఆధార్‌ను ప్రజాసాధికార సర్వేతో అనుసంధానం చేసి అర్హత లేదంటూ తొలగించింది. దీంతో కార్డు వచ్చిన ఆనందం లబ్ధిదారుల్లో అంతలోనే ఆవిరైపోయింది.
3,700 కార్డుల రద్దు
జిల్లాకు కొత్తగా 95 వేల రేషన్ కార్డుల మంజూరయ్యాయి. నాల్గో విడత జన్మభూమిలో 72,531 కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలినవి లబ్ధిదారులు స్వయంగా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తీసుకున్నారు. కొత్తగా మంజూరైన వాటిలో 3,700 కార్డులను పూర్తిగా రద్దు చేశారు. కార్డులు పొందిన వారికి సంబం«ధించిన ఆధార్ వివరాలను ప్రజాసాధికార సర్వే వివరాలతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆరు అంచెల పరిశీలన చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నాలుగు చక్రాల వాహనం ఉందంటూ కొందరిని, పరిమితికి మించి సొంత ఇల్లు ఉందని మరికొందరిని.. ఇలా వివిధ కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ కార్డులను రద్దు చేసింది. ఇదే క్రమంలో మున్ముందు మరిన్ని కార్డులు రద్దు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
‘ఉపాధి’ కోసం పెట్టుకుంటే..
జిల్లాలో పలువురు వ్యాన్లు, టాటా సుమోలు, జీపులు వంటి నాలుగు చక్రాల వాహనాలను నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, కనగానపల్లి, తగరకుంట, గుత్తి, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, రాయదుర్గం.. ఇలా పలు ప్రాంతాల్లో పేద వర్గాలకు చెందిన నిరుద్యోగులు నాలుగు చక్రాల వాహనాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో రుణం పొంది వాహనాలు కొనుగోలు చేశారు. సొంతంగా నడుపుతూ.. తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి వారికి కార్డులు రద్దు చేయడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
– ఓ.నల్లప్ప, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
సంక్షేమ పథకాలకు పేదలను దూరం చేసేందుకే ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం నిర్వహించిందని తొలి నుంచి చెబుతున్నాం. సర్వే వివరాలకు ఆధార్‌ను అనుసంధానం చేసి కార్డులు తొలగిస్తారని జనం భయపడినట్లే ఇప్పుడు జరుగుతోంది. జిల్లాలో వేలాది మంది పేద నిరుద్యోగ యువకులు అప్పులు చేసి.. నాలుగు చక్రాల వాహనాలు కొన్నారు. వీటి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వీరిని ప్రోత్సహించాల్సింది పోయి కార్డులు తొలగించడం అన్యాయం.