- నగదు మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద భారీ క్యూలు
- రెండో రోజుకు పెరిగిన రద్దీ
- పని చేయని ఏటీఎంలు
- రూ.500, రూ.50 నోట్లు నిల్
ఏటీఎంలు అలా.. బ్యాంకులు ఇలా
Published Fri, Nov 11 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
సాక్షి, రాజమహేంద్రవరం:
రూ. వెయ్యి, రూ. 500 నోట్లు మార్చుకునేందుకు వరుసగా రెండో రోజు కూడా ప్రజలు బ్యాంకుల వద్ద బారులుదీరారు. మొదటి రోజు గురువారం కన్నా రెండో రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో ప్రజలు నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించారు. ఉదయం 8:30 గంటలకు బ్యాంకులు తెరుచుకోగా అంతకంటే ముందుగానే ఆయా బ్యాంకుల ఖాతాదారులు, ప్రజలు క్యూ కట్టారు. వందలాది మంది ప్రజలు బ్యాంకుల లోపల ఉండగా అంతే సంఖ్యలో బయట వేచిఉన్నారు. తోపులలాటలు లేకుండా బ్యాంకు సిబ్బంది ప్రజలకు ప్రత్యేకంగా టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు ఇచ్చిన అనంతరం ఎలాంటి తోపులాటలకు తావులేకుండా విడతల వారీగా ప్రజలను బ్యాంకులోని అనుమతిస్తున్నారు. సాధారణ కౌంటర్లతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటి వద్ద ప్రజలు క్యూలో నిల్చుని తమ వంతు కోసం గంటల తరబడి వేసిచూశారు. ఉదయం క్యూలో నిల్చుంటే తమ వంతు వచ్చే వరకు సాయంత్రం అవుతోందని ప్రజలు వాపోతున్నారు. ఒక్కో వ్యక్తికి గరిష్టంగా రూ.10 వేలు ఇస్తున్నారు. కౌంటర్లలో రెండువేల నోట్లు, కొన్ని రూ.100 నోట్లు ఇస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి నగదు మార్పిడి చేస్తున్నారు. బ్యాంకు ఖాతాదారులకు వేరుగా, ప్రజలకు వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొంతమంది తమకు ఎక్కువ నగదు అవసరమంటూ బ్యాంకు మేనేజర్లను సంప్రదిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం రూ.10 వేలు మాత్రమే ఇవ్వగలమని, అంతకుమించి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పకోవని అధికారులు వివరించి తిరస్కరిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, ఆస్పత్రి ఖర్చులకు అవసరమని పలువురు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. నగదు మార్పిడిపై ఉన్న నిబంధనలు ఈ నెల 24 తరువాత కూడా కొనసాగుతాయాఅని బ్యాంకు అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నా ‘తాము ఏమీ చెప్పలే’మని సున్నితంగా చెప్పి తప్పుకుంటున్నారు.
పని చేయని ఏటీఎంలు
రూ.500, వెయ్యి నోట్లు మంగళవారం రాత్రి నుంచి రద్దు కాగా కొత్తనోట్లు వచ్చే వరకు అంటే బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు ఏటీఎంలు పని చేయవని కేంద్రం ప్రకటించడంతో శుక్రవారం నుంచి యథావిథిగా అన్ని ఏటీఎంలు పనిచేస్తాయని ప్రజలు భావించారు. అయితే జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కేవలం 20 శాతం ఏటీఎంలు మాత్రమే పని చేశాయి. ప్రస్తుతం కంప్యూటర్ వ్యవస్థలో ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్ల సమాచారం స్థానంలో రూ.100, రూ.50 నోట్ల సమాచారాన్ని ఏర్పాటు చేసి ప్రధాన సర్వర్‌కు అనుసంధానం చేయాల్సి ఉంది. ఇందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో అన్ని ఏటీఎంలు పని చేయడంలేదని, రూ.రెండు వేల నోట్లు పొడవు పెద్దదిగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న ఏటీఎం మిషన్లు అందుకు వీలుగా లేకపోగా రూ.500 నోట్లు రూ.50 నోట్లు ఇంకా బ్యాంకులకు చేరలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ’ఉదయం 8 గంటలకు బ్యాంకు వస్తున్నాం. అన్ని లెక్కలు చూసుకుని తిరిగి ఇంటికి వెళ్లే సరికి అర్ధరాత్రి రెండు గంటలవుతోందని, సిబ్బంది మొత్తం నగదు మార్పిడి చేసేందుకు బ్యాంకులోనే ఉండాల్సి రావడంతో ఏటీఎంలను పూర్తి స్థాయిలో పని చేయించలేకపోయామని ఎస్‌బీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. రెండు రోజుల్లో అన్ని ఏటీఎంలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Advertisement
Advertisement