డిజిటల్ డాబు.. ఏదీ జవాబు
Published Fri, Jan 6 2017 2:39 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు రహిత లావాదేవీల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు హోరెత్తిస్తున్నారు. జిల్లాను డిజిటల్ ఎకానమీ హబ్‌గా మార్చాలనుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ స్వగ్రామాల్ని మాత్రం గాలికొదిలేశారు. ఆ గ్రామాల్లో బ్యాంకు శాఖల మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క ఏటీఎం సెంటర్ కూడా లేదు. స్వైపింగ్ మెషిన్లు సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనే నగదు తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వగ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూశాయి.
ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామమైన పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో బ్యాంకుగాని, ఏటీఎం గాని లేవు. ఈ గ్రామ జనాభా దాదాపు 6 వేలు. ఇక్కడి వారంతా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోగల కవిటంలోని ఇండియ¯ŒS బ్యాంక్, ఎస్‌బీఐ శాఖలను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం పెదవేగి మండలంలోని దుగ్గిరాల. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కావాలంటే ప్రజలు ఏలూరు నగరానికి వెళ్లక తప్పని పరిస్థితి.
పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వగ్రామం బుట్టాయగూడెం మండలం రాజానగరం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కోసం కొయ్యలగూడెంలో ఏటీఎంలకు వెళ్లాలంటే 13 కిలోమీటర్లు.. బుట్టాయగూడెం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది.
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత ఊరు ఆగర్తిపాలెం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. ఆగర్తిపాలెంతో పాటు ఆగర్రు గ్రామం కూడా దాదాపు కలిసే ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 10 వేలకు పైగా జనాభాతో పాటు 5వేల ఓటర్లు ఉన్నారు. వరి, ఆక్వా సాగు చేసుకుని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా నగదు కోసం 5కిలోమీటర్లు దూరంలో ఉన్న పూలపల్లి లేదా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుపై ఆధారపడతారు.
నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం సరిపల్లి. ఆయన చాలా కాలం క్రితమే నరసాపురం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్వగ్రామంలో కనీసం ఒక్క ఏటీఎం కూడా లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని నరసాపురం రావాల్సిన పరిస్థితి.
జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) నివాస గ్రామమైన కుప్పనపూడిలో ఏటీఎం లేదు. ప్రజల నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రైతులకు అందుబాటులో సొసైటీలను, వాటి బ్రాంచిలను ఏర్పాటు చేసినప్పటికీ ఏటీఎంలు లేకపోవడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Advertisement
Advertisement