104 వాహనాల్లో కానరాని వైద్యులు
అందుబాటులో ఉండని మందులు
వేతనాలు పెరగక సిబ్బంది వెతలు
రోగుల్లేకున్నా ఎక్కువగా ఓపీ నమోదు
పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ మాయాజాలం
పార్వతీపురం: పల్లెల్లో వైద్య సేవలందిస్తాం. గ్రామీణుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాం.. అంటూ ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రన్న సంచార చికిత్స సేవలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఒకప్పుడు 104 పేరుతో చక్కని సేవలందించిన పథకాన్ని చంద్రన్న సంచార చికిత్సగా పేరు మారింది తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రభుత్వం పీఎస్‌ఎంఆర్‌ఐ అనే ప్రైవేటు సంస్థకు చంద్రన్న సంచార చికిత్స నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అప్పటినుంచి వైద్యసేవలు పూర్తిగా పడకేశాయి. సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఫార్మసిస్టే వైద్యుడు
వాహనంలో వైద్యుడు, ఫార్మసిస్ట్, స్టాఫ్‌నర్స్, ల్యాట్‌టెక్నీషియన్, డ్రైవర్లుండాలి. కానీ ప్రస్తుతం ఏ వాహనాలోనూ వైద్యులు కానవడం లేదు. దీంతో ఫార్మసిస్ట్ వైద్యుని పాత్ర పోషిస్తున్నారు. ఇందువల్ల నాణ్యమైన వైద్యం అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కానరాని అత్యవసర మందులు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థలు ప్రతి వాహనంలో దాదాపు 120 రకాల మందులు, ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలి. ఇంతవరకు ఇంజక్షన్‌ను వినియోగించకపోగా, కేవలం 20 రకాల లోపు మందులతో సంచార సేవలు అందిస్తున్నారు. అత్యవసరమైన మందులేవీ అందుబాటులో ఉండటం లేదు. గర్భిణులకు, బాలింతలు, పసిపిల్లలు, వద్ధులకు వైద్య పరీక్షలు చేసి సేవలందించేందుకు వాహనంలో స్టాఫ్ నర్సు ఉండాలి.
కంప్యూటర్ ఆపరేటర్‌గా స్టాఫ్‌నర్సు
పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ స్టాఫ్‌నర్స్‌లను రోజువారీ ఓపీ డేటా పంపించే కంప్యూటర్ ఆపరేటర్‌లా వాడుకుంటోంది. నిలదీస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నట్టు పలువురు స్టాఫ్‌నర్సులు వాపోయారు. గతంలో ప్రతి వాహనంలో ఓపీ వివరాలను పంపించేందుకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేవారు. ప్రస్తుతం వాళ్లను తొలగించి స్టాఫ్ నర్స్‌లకు అప్పగించారు. చంద్రన్న సంచార వాహనాల సేవలు దాదాపు పడకేయడంతో రోగుల సంఖ్య తగ్గిపోయింది. చాలా గ్రామాల్లో వాహనం వద్దకు రోగుల రాకపోయినా, తక్కువ వచ్చినా ఎక్కువగా నమోదు చేయమని యాజమాన్యం సిబ్బందిని బెదిరిస్తున్నట్టు సమాచారం.
పరికరాల్లేవు.. ఉన్నా వాడరు
మైక్రోస్కోప్, నిబిలైజర్ (ఆస్తమా రోగులకు అత్యవసర సమయంలో వాడే పరికరం) ఆప్తాల్మిక్ స్కోప్ (కంటి రెటీనాని పరీక్షించే పరికరం) ఫెటోస్కోప్ (గర్భిణులను పరీక్షించేది), ఎల్‌ఈడీ ఎక్స్‌రే బోర్డ్, ఈసీజీ (గుండె పరీక్షలకు వాడేది) ప్రింటర్, థర్మోమీటర్ లాంటి విలువైన పరికరాలు వాహనంలో ఉన్నా వాటిని వినియోగించడం లేదు. కొన్ని వాహనాల్లో ఆ పరికరాలేవీ కానవడం లేదు. ప్రతి వాహనంలో మలేరియా, టైఫాయిడ్, పచ్చకామెర్లు, ఉమ్మి, కఫం పరీక్షలు (టీబీకి సంబందించి), అన్ని రక్త పరీక్షలు, మూత్రం, మధుమేహం, బ్లడ్ సుగర్, హెచ్‌బీ తదితర అన్ని రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ చంద్రన్న సంచార చికిత్స 104 సేవలు చేపట్టి 6 నెలలు కావస్తున్నా ఈ సేవలేవీ అందడం లేదు. ఒకే ఒక్క ఆర్‌బీఎస్ (డైబెట్స్) పరీక్షతో ల్యాబ్‌టెక్నీషియన్లు సరిపెట్టి ఖాళీగా ఉంటున్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా 104లో పనిచేస్తున్న సిబ్బందికి ఇస్తున్న వేతనాలు అంతంతమాత్రమే. చేరినప్పటి నుంచి ఒకే జీతంతో పనిచేస్తున్నారు. అదికూడా ఆలస్యంగా ఇస్తున్నట్టు సిబ్బంది తెలిపారు.
డొక్కు వాహనాలతో నిర్వహణ
ప్రస్తుతం వాహనంలో పనిచేస్తున్న సిబ్బంది సెలవు పెట్టినప్పుడు ప్రత్యామ్నాయ సిబ్బంది లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. జిల్లా మొత్తానికి ఒక్క ఉద్యోగిని మాత్రమే ప్రత్యామ్నాయంగా నియమించడంతో అత్యవసర పరిస్థితిలో సెలవు పెట్టలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. పాత బడిన వాహనాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మరమ్మతులకు గురై ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో వైద్యసేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
అందని సేవలు– కొల్లి సాంబమూర్తి, సీపీఎం నాయకులు.
చంద్రన్న సంచార చికిత్స 104 వాహనంలో సేవలు అందడం లేదు. వాహనంలో మందులు లేవు. రక్త పరీక్షలు జరగవు. వైద్యులుండరు. ఒకరిద్దరు సిబ్బందితో అలా నడిపించేస్తున్నారు.
వాహనం రావడం లేదు– గులిపల్లి చిన్న సుధ, కొమరాడ.
గతంలోలా 104 వాహనాలు మా గ్రామాలకు రావడం లేదు. చంద్రన్న సంచార చికిత్సగా మార్చాక సేవలందడం లేదు. దీంతో మా గ్రామస్తులు వాహనం కోసం నిరీక్షించడం లేదు.