ఏడాదైనా ఏదీ వసంతం? | no vasantham | Sakshi
Sakshi News home page

ఏడాదైనా ఏదీ వసంతం?

Published Sun, Jul 24 2016 11:12 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM

ఏడాదైనా ఏదీ వసంతం? - Sakshi

ఏడాదైనా ఏదీ వసంతం?

  • గత జూలై 26న మహా పుష్కరవనానికి శంకుస్థాపన
  • చిరస్మరణీయ కానుకగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు
  • ఇప్పటివరకూ పెరిగినవి పిచ్చితుప్పలు, పచ్చగడ్డే
  • ముఖ్యమంత్రి ‘హామీలకు నమూనా’గా మిగిలిన పైలాన్‌
  •  
    లాలాచెరువు (రాజానగరం) :
     
    ‘గోదావరి మహాపుష్కరాలు విజయవంతమైన నేపథ్యంలో రాజమండ్రి ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే ఈ ‘గోదావరి మహాపుష్కర వనాని’కి అంకురార్పణ చేస్తున్నా’నంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం అందరికీ గుర్తుండే ఉంటుంది. పుష్కరాల ముగింపు సందర్భంగా లాలాచెరువులోని రిజర్వు ఫారెస్టు ఏరియాలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో మహాపుష్కర వనానికి చంద్రబాబు శంకుస్థాపన చేసి మంగళవారం నాటికి ఏడాదవుతుంది. అయితే  ఆరు రుతువులూ వచ్చి వెళ్లినా ఆ వనానికి ఇంకా వసంతం రాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఆ సమయంలో అక్కడ సీఎం ప్రారంభించిన మహాపుష్కరాల పైలాన్‌ మాత్రం ‘బాబు హామీలిలాగే ఉంటాయ’నడానికి సాక్షిగా దర్శనమిస్తోంది.
     
    ‘రాశి’ వనానికీ వికాసం కరువే..
    ఈ వనంలో సైన్సు విద్యార్థులకు ఉపకరించేలా ఏర్పాటుచేస్తామని చెప్పిన బొటానికల్‌ గార్డెన్, మీ రాశిలను బట్టి మొక్కలను నాటి మీ జాతకాన్ని మార్చుకోండంటూ శ్రీకారం చుట్టిన ‘రాశి’ వనం అభివృద్ధికి నోచుకోలేదు. నాడు ‘రాశి’ వనంలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాటిన మొక్కలు మినహా ఇంతవరకు అదనంగా వనాన్ని విస్తరించిన జాడ లేదు. జీవితంలో ఎదురయ్యే చీడపీడల నుండి జన్మ నక్షత్రాలు, పేర్లను అనుసరించి వచ్చే రాశుల ప్రకారం ఈ మొక్కలను నాటి ఆయా దోషాలను నివృత్తి చేసుకోవచ్చంటూ ఆర్భాటంగా ప్రచారం చేయడమే కాక ఇందుకోసం సమీపంలో ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేస్తామన్న అటవీ శాఖ అధికారులు తరువాత ఆ మాటే మరిచారు. 
     
    ఏడాది కానుకగా గోడ
    మహాపుష్కర వనానికి శంకుస్థాపన చేసిన ఏడాదవుతున్న సందర్భంగా ఏమీ చేయకపోతే బావుండదనుకున్నట్టు..వనానికి ప్రహారీని, ముఖద్వారాన్ని నిర్మిస్తున్నారు. గత జూలై 26న సీఎం పైలాన్‌ని ఆవిష్కరించి, పుష్కర వనానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పిచ్చి మొక్కలు, పచ్చగడ్డి మాత్రమే పెరిగాయి. 
    మంజూరైంది కేంద్ర నిధులే..
    పుష్కర వనానికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో కేవలం రూ.98 లక్షలు మాత్రమే కేటాయించారు ఈ నిధుల్లో కేంద్రం కేటాయించిన నిధులు రూ.43 లక్షలు మాత్రమే మంజూరు కావడంతో పాలుపోని అధికారులు రక్షణ గోడ, ముఖద్వారం వంటి పనులు చేసి ఏడాదైనా ఏమీ చేయలేదనే అపప్రథను తొలగించుకోజూస్తున్నారు. 
     
    ఆగస్టు 15 నాటికి ఓ రూపు తెస్తాం
    మహాపుష్కర వనానికి ఆగస్టు 15నాటికి ఒక రూపాన్ని తీసుకువస్తాం. బడ్జెట్‌లో సుమారు రూ.98 లక్షలు కేటాయించగా ఏఏ పనులు చేయాలో శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. కాంపౌండ్‌ వాల్‌తో రెండు ముఖద్వారాలు, యోగా లాన్‌ నిర్మించి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. రాశి, నక్షత్ర వనాలను అభివృద్ధి చేసి, వాకింగ్, సైకిలింగ్‌ పార్కులు ఏర్పాటు చేస్తాం. ఆటోనగర్‌ వైపు ఫెన్సింగ్‌ వేస్తున్నాం. సోలార్‌ లైట్లు, టిక్కెట్‌ కౌంటర్ల ఏర్పాటుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సైన్స్‌ ల్యాబ్, నేచురల్‌ స్టడీ సెంటర్స్‌ని మరింత అభివృద్ధి చేస్తాం.  మెరైన్‌  మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. కాకినాడలో కూడా ఏర్పాటు చేయవలసి పార్కు రెండోదశలో ఏర్పాటవుతుంది. 
    – ప్రభాకరరావు, డీఎఫ్‌ఓ, వైల్డ్‌ లైఫ్‌ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement