మాట్లాడుతున్న ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు
–విజయవాడ, గుంటూరుకు నేరు బస్సులుండవు
– పోనురాను టికెట్లు ఒకేసారి కొనుక్కోవచ్చు
– ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు
తిరుపతి అర్బన్: కృష్ణా పుష్కరాల స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమలులో ఉంటాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. పుష్కరాలకు ఆర్టీసీ తరఫున తీసుకున్న ప్రత్యేక చర్యలు, ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులను బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరించారు. జిల్లాలోని 14 డిపోల నుంచి ప్రస్తుతానికి 11 రెగ్యులర్ బస్సులు విజయవాడకు నడుస్తున్నాయని, వాటితో పాటు పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి రోజూ 40 నుంచి 50 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరాలు జరిగే రోజుల్లో విజయవాడ, గుంటూరు నగరాలకు నేరుగా బస్సులు వెళ్లవని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా గోరంట్ల వరకు పుష్కరాల బస్సుల్లో వెళ్లి, అక్కడి నుంచి టౌన్ సర్వీసుల్లో జంట నగరాలకు చేరుకునేలా సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. గోరంట్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పుష్కరాల బస్టాండుకు భక్తుల తాకిడి అంచనాలకు మించి పెరిగితే, అంతకు ముందే వచ్చే చిలకలూరిపేట, మేదరమిట్ల ఆర్టీసీ బస్టాండ్‌లలో భక్తులను కొంతసేపు నియంత్రించి పుష్కరాలకు అనుమతిస్తారన్నారు. గోరంట్ల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండు ప్రాంతంలో సుమారు 4వేల మందికి పైగా భక్తులు బస చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గోరంట్లలో అన్ని అధునాతన శాటిలైట్ విజ్ఞానాన్ని వినియోగించుకుని సాంకేతికంగా అన్ని సేవలను అందిస్తామని వివరించారు.
పోను,రాను టికెట్లు ఒకేసారి కొనుక్కోవచ్చు
యాత్రికులు పోను, రాను టికెట్లను ఒకేసారి కొనుక్కునే వెసులుబాటు కల్పించినట్లు ఆర్‌ఎం తెలిపారు. ఏ కేటగిరీ బస్సు టికెట్ కొనుక్కున్నా, తిరుగు ప్రయాణంలో ఆ కేటగిరీ బస్సులు అందుబాటులో లేకపోయినా ఇతర కేటగిరీ బస్సుల్లో వ్యత్యాసపు చార్జీలు చెల్లించి ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గోరంట్ల, అమరావతి బస్టాండ్ల నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే భక్తులకు ఉచిత మినీ బస్సుల సౌకర్యం కల్పించామన్నారు.
పుష్కర సేవల్లో 1200 మంది సిబ్బంది
కృష్ణా్ణ పుష్కరాల సేవలో చిత్తూరు ఆర్టీసీ రీజియన్ నుంచి 1200 మంది సిబ్బంది పాల్గొంటున్నారని ఆర్‌ఎం వెల్లడించారు. కంటింజెన్సీ ప్లాన్‌లో జిల్లాలోని 14 డిపోల నుంచి 50 బస్సులను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. 12 రోజుల పాటు 450 బస్సులను నడపాలన్న లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. గ్రూపులుగా వెళ్లాలనుకుంటే ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. 9959225684 నంబరులో సంప్రదిస్తే బల్క్ బుకింగ్, ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తారన్నారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ చంద్రశేఖర్, పీఆర్వో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.