కంటి తుడుపు | not fully charged | Sakshi
Sakshi News home page

కంటి తుడుపు

Published Sat, Sep 3 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

రెయిన్‌ గన్‌ పనితీరును పరిశీలిస్తున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్ప(ఫైల్‌)

రెయిన్‌ గన్‌ పనితీరును పరిశీలిస్తున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్ప(ఫైల్‌)

–నామమాత్రంగా వేరుశనగ పంట తడులు 
– మమ అనిపించిన ప్రభుత్వం 
– హడావుడి చేసిన మంత్రులు 
– రైతుల పెదవి విరుపు 
చిత్తూరు (అగ్రికల్చర్‌): 
 వేరుశనగ పంటకు ప్రభుత్వం అందించిన తడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎకరా విస్తీర్ణంలోని పంటను తడిపేందుకు  4 ట్యాంకర్ల నీటికి మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. ఫలితంగా కనీసమేర కూడా నేల తడవలేదు. ఈ మొక్కుబడి తడులపట్ల రైతులు ఆసక్తి చూపడం లేదు. మంత్రులు మాత్రం వేరుశనగకు తడులు ఇచ్చేశాం, ఎండనీయకుండా కాపాడామంటూ హడావుడి చేస్తున్నారు.  పదిరోజులుగా 18 వేల హెక్టార్లలో మాత్రమే తడులిస్తే,గడచిన రెండురోజుల్లోనే 12 వేల హెక్టార్లలో తడులు పూర్తిచేసే విధంగా ముందస్తుగానే నిర్ణయించేసుకున్నారు. దీంతో ఈ నామమాత్రపు  తడులు మాకొద్దంటున్నారు. 
  జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 1.21 లక్షల హెక్టార్లలో సాగవుతున్న వేరుశనగ పంట తీవ్ర వర్షాభావంతో ఎండిపోయింది. నెలరోజులుగా వర్షాభావంతో ఎండిపోయిన పంటను ఆఖరి నిమిషంలో కాపాడతామంటూ చంద్రబాబు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం రెయిన్‌ గన్స్, జనరేటర్లు, స్పింకర్లు తెప్పించి పది రోజులుగా పంటను తడిపే పనులకు శ్రీకారం చుట్టింది. వర్షాధారంగా సాగయ్యే వేరుశనగ పంటను అత్యధికంగా రైతులు నీటి సౌకర్యంలేని మెట్టప్రాంతాల్లో సాగుచేస్తారు. ఈ  మెట్టప్రాంత చేలల్లోని వేరుశనగ పంటను తడిపేందుకు ట్యాకర్ల ద్వారా నీటిని తరలించాల్సి ఉంది. 
నీటి సౌకర్యం లేని మెట్టప్రాంతంలోని పంటకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి, పంటను తడపాలి. ఇందుకుగాను ఎకరా విస్తీర్ణంలోని పంటను తడిపేందుకు 4 ట్యాంకర్ల నీటికే అనుమతి ఇచ్చింది. ఒక ట్యాంకర్‌ నీటిని తరలించేందుకు ప్రభుత్వం రూ. 260 మాత్రమే చెల్లిస్తోంది. ఒక ట్యాకర్‌ నీటిని కొనుగోలు చేయాలంటే రూ. 600 నుంచి రూ. 800 వరకు వెచ్చించాల్సి ఉంది. ఒక్కో  రైతు ఎకరాకు రూ. 2 వేల వరకు అదనపు మొత్తాన్ని భరించాల్సి ఉంది. ఈ మొత్తాలను వెచ్చించినా ఎకరాకు 4 ట్యాంకర్లు ఏమాత్రం చాలవని రైతులంటున్నారు. దీంతో వీరు చాలీచాలని తడుపులపై ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. 
  మొదటి విడత తడులను శుక్రవారంతో ముగించేశారు. మరోపక్క వేరుశనగ పంటకు తడులు అందించి కాపాడేస్తామంటూ  నలుగురు మంత్రులు ఐదు రోజులుగా జిల్లాలో తిష్టవేశారు.  హడావుడిగా చాలీచాలని తడులు అందించి మొత్తం పంటలను అనతికాలంలోనే తడిపేశామంటూ వీరు చెబుతుండటం గమనార్హం. మొత్తం 38 వేల హెక్టార్లలో పంట ఎండిపోయిందని మంత్రులంటున్నారు. ఈ వారంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి, ప్రభుత్వం ఇచ్చిన తడులకు 26 వేల హెక్టార్ల పంటకు ఉపశమనం కలిగిందని, 12,619 హెక్టార్లలో తడులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. తడులు ఇవ్వకుండా మిగిలిపోయిన 17,739 ఎకరాలకు గాను 8, 353 ఎకరాలకు తడులు ఇచ్చామని, మిగిలిన 9.386 ఎకరాలను శుక్రవారం సాయంత్రానికి పూర్తిచేసి, వందశాతం పూర్తి చేస్తామని  గురువారం పొంతన లేని లెక్కలు చూపెట్టారు.  దీనిబట్టి చూస్తే మంత్రులు వేరుశనగ పంటను కాపాడడంలో ఏవిధంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది అర్ధమవుతోంది. ఏమైనప్పటికి ప్రభుత్వం సమకూర్చిన తడులతో పంటను కాపాడిన దాఖలాలు లేవని రైతులు అభిప్రాయపడుతున్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement