తిరుమలకొండపై నో ఫ్లై జోన్ కుదరదు | Not Possible to declare 'No Fly Zone' over Tirumala Hills: Centre government | Sakshi
Sakshi News home page

తిరుమలకొండపై నో ఫ్లై జోన్ కుదరదు

Published Wed, Jul 20 2016 6:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

ఆలయం గోపురంపైనే వెళుతున్న విమానం (ఫైల్‌)

ఆలయం గోపురంపైనే వెళుతున్న విమానం (ఫైల్‌)

– తేల్చి చెప్పిన కేంద్రం..
– చొరవ చూపని టీడీపీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు?
– ఆందోళనలో ఆలయ శ్రీవారి భద్రత
– తలపట్టుకున్న టీటీడీ, భద్రతా విభాగాలు
– సబబుకాదంటూనే మౌనం దాల్చిన
  టీటీడీ ఆగమ సలహాదారులు

సాక్షి,తిరుమల: శ్రీవారి ఆలయ గగనతలంపై విమానాలు ఎగరకూడదని పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి ఆలయానికి రెండువేల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. వైఖానస ఆగమ నిబంధనలకు లోబడి నిత్యపూజలతో అలరారే స్వామివారి ఆలయ పవిత్రత చాలా ముఖ్యం. ఏటా 450కిపైగా నిత్యసేవలు,పూజలు,ఉత్సవాలతో స్వామివారు భక్తకోటికి దర్శనమిస్తూ సాక్షాత్కరిస్తుంటారు. సాక్షాత్తూ దేవతలు సైతం నిత్యం ఆకాశమార్గం నుంచి గర్భాలయమూర్తిని అరూపంగా దర్శించి సేవిస్తున్నారని ఆగమం చెబుతోంది. వైఖానస ఆగమ నిబంధనల ప్రకారం ఆలయ గగనతలంపై ఇతర లోహ పరికరాలు(విమానాలు, హెలికాఫ్టర్లు, ద్రోణ్‌) ఎగరకూడదని పండితులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.

పార్లమెంటరీ భద్రతా కమిటీ హామీ బుట్టదాఖలు
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు పెరిగిపోయాయి. అగ్రరాజ్యమైన అమెరికాలోని ట్విన్‌ టవర్స్‌పైనే ఏకంగా  విమానాలతో జరిగిన ఉగ్రదాడితో ప్రపంచమే తెల్లబోయింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా భద్రతా విభాగం అప్రమత్తమైంది. రక్షణ చర్యలు రెట్టింపు చేసింది. ముష్కరుల టార్గెట్‌లో తిరుమల కూడా ఉందని 2009లోనే అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వెల్లడించారు. ఆలయ పవిత్రతోపాటు భద్రతా పరంగా విమానాలు విమానాల రాకపోకల్ని నిషేధించాలని సంకల్పించారు.

తర్వాత 2010లో కేంద్ర మాజీ మంత్రి అద్వానీ నేతృత్వంలోని పార్లమెంటరీ భద్రతా కమిటీ తిరుమల పర్యటనలో భాగంగా శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగకుండా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి కూడా విమానాలపై తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన అశోక్‌గజపతి రాజు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కూడా దీనిపై హామీ ఇచ్చారు. దీంతో తిరుమలకొండ మీద విమానాల నిషేధం ఖాయమని అందరూ భావించారు. ఈ తరుణంలో మంగళవారం రాజ్యసభలో ఆశాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా ‘నిషేధం కుదరదు’ అని తేల్చేసి నిరాశపరిచారు.

తిరుమలకొండ కిందే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న కారణంగా నిషేధించడానికి సాధ్యంకాదని, దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రాతపూర్వంగా వివరణ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఉండి కూడా నో ఫై జోన్‌ తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి

తలపట్టుకున్న టీటీడీ, భద్రతా విభాగాలు
కేంద్రం చేతులెత్తేయడం టీటీడీ, భద్రతా విభాగాలకు తలనొప్పిగా మారింది. తరచూ విమానాలు ఆలయ గగనతలంపై సమీపంలోనే చక్కర్లు కొడుతున్నాయి. తాజా నిర్ణయంతో  టీటీడీ, భద్రతాధికారుల్లో ఆందోళన రెట్టింపైంది. గత ఏడాది తిరుమలలో రెక్కీ జరిగినట్టు ఉగ్రవాద సానుభూతిపరులు వెల్లడించడం, తిరుమలలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తరచూ కేంద్ర, నిఘా వర్గాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం ఎంతవరకు సబబు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు ఆలయ పవిత్రత, అటు భద్రతా లోటును ఏ విధంగా పూడ్చాలనే అంశంపై టీటీడీ, భద్రతా విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

సబబుకాదంటూనే మౌనందాల్చిన టీటీడీ ఆగమ సలహాదారులు
శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఆగమ పరంగా పూజా కైంకర్యాలు, ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశాల్లో సలహాలిచ్చేందుకు ప్రత్యేకంగా ఆగమ సలహాదారులున్నారు. వీరిలో ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు, ఏకే సుందరవరదన్, తిరుపతికి చెందిన విష్ణుభట్టాచార్యులు, తమిళనాడుకు చెందిన అప్పికట్ల దేశికాచార్యులు, ద్వారకా తిరుమలకు చెందిన రాంబాబు ఉన్నారు. తిరుమలతో ముడిపడిన కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పరిపాలన పరమైన నిర్ణయమైనా ఆలయపరంగా సబబు కాదని స్పష్టం చే శారు. దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం.

 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement