ఇక ప్లాస్టిక్ రోడ్లు
ఇక ప్లాస్టిక్ రోడ్లు
Published Mon, Dec 19 2016 9:27 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
– ప్రయోగాత్మకంగా వెల్దుర్తి–మల్లేపల్లి మధ్య నిర్మాణం
కర్నూలు(అర్బన్): పనికిరాని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పాలిథిన్ సంచులు, ఖాళీ వాటర్ బాటిళ్లు, సెలైన్ బాటిళ్లు ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువులన్నీ ఇక నుంచి ఉపయోగంలోకి రానున్నాయి. వేస్ట్ ప్లాస్టిక్‌తో రోడ్లను వేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు నిర్ణయించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వేసిన ప్లాస్టిక్ రోడ్లను పరిశీలించిన సంబంధిత పీఐయూ ఈఈ వెంకటరమణారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు శ్రీకారం చుట్టారు. పైగా బీటీ రోడ్డుకు అయ్యే ఖర్చు కంటే కొంత తక్కువగా ఉండడం, ఎక్కువ కాలం మన్నిక వస్తుండండతో ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు పీఆర్ సీఈ కూడా అంగీకరించినట్లు ఈఈ తెలిపారు. సోమవారం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ బీటీ రోడ్డు వేసే సమయంలో వేస్ట్ ప్లాస్టిక్ వస్తువులను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి శుభ్రం చేసి తారు, కంకర మిశ్రమంలో కలిపి వేస్తే సాధారణ బీటీ రోడ్డు కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి 44 నుంచి మల్లెపల్లి వరకు 3 కిలోమీటర్ల మేర రూ.1.25 కోట్లతో ప్లాస్టిక్ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్స్‌ను సీఈ కార్యాలయానికి పంపించామని, అక్కడి నుంచి అనుమతులు కూడా లభించాయన్నారు. పెద్ద పెద్ద నగరాలు, విదేశాల్లో ప్లాస్టిక్ రోడ్లు ఉన్నాయన్నారు. గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్ద కిలోమీటర్ ప్లాస్టిక్ రోడ్డు వేశారన్నారు. ఏపీలో వెల్దుర్తి – మల్లేపల్లి రోడ్డే తొలి ప్లాస్టిక్ రోడ్డు అవుతుందనే భావనను ఈఈ వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement