కాల్‌మనీ పాపంలో ప్రవాసులకూ వాటా! | NRIs involvement in call money scandal | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ పాపంలో ప్రవాసులకూ వాటా!

Published Fri, Jan 15 2016 9:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:44 PM

కాల్‌మనీ పాపంలో ప్రవాసులకూ వాటా!

కాల్‌మనీ పాపంలో ప్రవాసులకూ వాటా!

కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు ప్రవాస భారతీయులతోపాటు ఇక్కడ ఆర్థికంగా స్థితిమంతులైన ఎన్జీవో నేతలు..

- ఎన్‌ఆర్‌ఐ, ఎన్జీవో నేతల పెట్టుబడులు
- కస్టడీలోని నిందితుల ఒప్పుకోలు
- రహస్యంగా ఆరాతీస్తున్న పోలీసులు
 
సాక్షి ప్రతినిధి, విజయవాడ:
కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు ప్రవాస భారతీయులతోపాటు ఇక్కడ ఆర్థికంగా స్థితిమంతులైన ఎన్జీవో నేతలు కాల్‌మనీ సెక్స్ రాకెట్ ముఠా తరఫున పెట్టుబడులు పెట్టిన వ్యవహారం పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తోంది. కేసులో ముఠా ఆగడాలపై మాత్రమే ఇప్పటివరకు పోలీసులు దృష్టిసారించారు. పోలీసు కస్టడీకి తీసుకున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ ముఠాలోని ప్రధాన నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తి, దూడల రాజేష్‌లు ఆర్థిక పెట్టుబడులపై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ కేసులో నిందితులు విద్యుత్‌శాఖ డీఈ ఎం.సత్యానందం, చెన్నుపాటి శ్రీనివాసరావు, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్ పరారీలో ఉన్నారు. కేసు విచారణలో భాగంగా ఆరు రోజుల పాటు రాము, రాజేష్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వీరి నుంచి ముఠాకు పెట్టుబడి పెట్టిన పలువురి వివరాలను పోలీసులు సేకరించినట్లు తెలిసింది.

పెద్దల పెట్టుబడులు...
అమెరికాలో నివాసం ఉంటున్న సత్యానందం సమీప బంధువు, తానా సంఘంలోని ఓ కీలక వ్యక్తి వీరికి పెట్టుబడులు సమకూర్చినవారిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరితోపాటు నగరానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, బిల్డర్లతోపాటు ఎన్జీవో సంఘానికి చెందిన కొందరి పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు చెపుతున్నారు. పలుమార్లు కాల్‌మనీ ఘాతుకాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఆయా వ్యక్తుల జోక్యంతో సర్దుబాటు చేసినట్లు తెలిసింది.

ఒకానొక దశలో తమను ఇబ్బందుల నుంచి బయటపడేయకపోతే పెట్టుబడులు పెట్టిన వారి జాతకాలు బయటపెడతామంటూ నిందితుల్లో కొందరు బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి.   వీరికి పెట్టుబడులు సమకూర్చిన వారి వివరాలతోపాటు తాము మహిళలతో వ్యవహరించిన తీరు, వారిని లొంగదీసుకునేందుకు అనుసరించిన విధానాలను వెల్లడించినట్లు తెలిసింది. అధికార పార్టీతో తమకు ఉన్న సంబంధాలు, మిగిలిన నిందితుల పరారీకి సహకరించే అవకాశం ఉన్న వారి పేర్లను పోలీసు అధికారుల ఎదుట పూసగుచ్చినట్లు చెపుతున్నారు.

రహస్య విచారణ...
పోలీసు కస్టడీలో నిందితులు వెల్లడించిన వ్యక్తులకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు సరిపోల్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. కేసుకు సంబంధించి అధికార పార్టీపై ఆరోపణలు, ప్రజాప్రతినిధుల ప్రమేయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వచ్చిన సమాచారాన్ని నిర్ధారించేందుకు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. ఆయా వ్యక్తులకు సంబంధించిన వివరాలను గోప్యంగా సేకరిస్తున్నారు. అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత ప్రభుత్వానికి రహస్య నివేదిక ఇచ్చేందుకు పోలీసు పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా తదుపరి ముందుకు సాగాలనేది పోలీసు అధికారులు నిర్ణయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement