పండ్ల దుకాణాలపై అధికారుల దాడులు
నిషేధిత మందుల ద్వారా పండ్లను మాగబెడుతున్నారని ఫిర్యాదులు అందడంతో మంగళవారం ఆహార నియంత్రణాధికారులు దాడులు నిర్వహించారు.
కర్నూలు(హాస్పిటల్): నిషేధిత మందుల ద్వారా పండ్లను మాగబెడుతున్నారని ఫిర్యాదులు అందడంతో మంగళవారం ఆహార నియంత్రణాధికారులు దాడులు నిర్వహించారు. జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎ. విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సి.క్యాంపు సెంటర్‌లోని పండ్ల దుకాణాన్ని గజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శంకర్, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ చక్రవర్తి తనిఖీ చేశారు. నిషేధిత కార్బైడ్‌తో అరటి పండ్లను మాగబెట్టి విక్రయిస్తున్నారన్న అనుమానంతో పలు శ్యాంపిళ్లను సేకరించారు. దీంతో పాటు పలు ఆపిల్ పండ్లను పరిశీలించి, వాటిపై మైనం పూసి ఉండటాన్ని గమనించారు. వాటిని సైతం శాంపిల్ తీసి పరీక్షలకు పంపించారు. పండ్ల దుకాణానికి ఆహార నియంత్రణ శాఖ నుంచి లైసెన్స్ పొందలేదని గుర్తించారు. ఈ సందర్భంగా ఎ. విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కార్బైడ్‌తో అరటి పండ్లను మాగించడం నేరమన్నారు. ఈ పండ్లను తింటే అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర హైకోర్టు సైతం ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరూ నిషేధిత మందులతో మాగబెట్టిన పండ్లను విక్రయించరాదని ఆదేశించారు.