అంచనాలకు మించి..
Published Wed, Nov 30 2016 3:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
విజయనగరం గంటస్తంభం: అధికారుల అత్యుత్సాహం వారికి ఇప్పుడు అవస్థలు తెచ్చి పెట్టింది. పరువు కోసం పాకులాడితే ప్రస్తుతం ఆందోళనలో పడిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటీవల నిర్వహించిన విజయనగరం ఉత్సవాల్లో అంచనాలకు మించి అధికారులు ఖర్చు చేసి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. నిజానికి ప్రభుత్వం విజయనగరం ఉత్సవాల కోసం రూ.25లక్షలు మంజూరు చేసింది. కానీ అధికారులు రూ. 62 లక్షలు ఖర్చు చేశారు.
పెండింగ్‌లో బిల్లులు..
అంచనాలకు మించి ఖర్చు చేయడం ఒక ఎత్తయితే ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కూడా అధికారుల ఖాతాల్లో జమ కాకపోవడం మరో ఎత్తు. దీంతో మంజూరైన నిధులను దక్కించుకోవడానికి, అధికంగా ఖర్చు పెట్టిన నిధులు తెచ్చుకోవడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అక్టోబర్ 15 నుంచి 17వరకు ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పూల ప్రదర్శనలు, సైన్‌స ఫెయిర్, ఇతర కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు..
ఉత్సవాలకు ముందు రూ.40లక్షలు ఖర్చు అవుతుందని ఇన్‌చార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు అంచనా తెలిపారు. కానీ అనుకున్నదానికంటే రూ. 22 లక్షల ఖర్చు పెరగడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడంలో తప్పు లేదు కానీ, రాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఇబ్బంది పడుతుంటే ఇంత ఖర్చు అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల్లో రూ. 62 లక్షలు ఖర్చు చేయడం సాధ్యమా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆర్భాటాలకు ఇంత ఖర్చుపెట్టడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు.
మంజూరైన నిధులూ రాలేదు..
మంత్రి రఘునాథరెడ్డి జిల్లాకు వచ్చినపుడు కలెక్టర్ రూ.40లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. రూ.10లక్షలు పర్యాటక శాఖ ఇస్తుందని చెప్పగా మిగిలిన రూ.30లక్షలను సాంస్కృతిక శాఖ నుంచి తాను మంజూరు చేస్తానన్నారు. కానీ ఇంతవరకు ఆ శాఖ నుంచి ఒక్కపైసా కూడా రాలేదు. పర్యాటక శాఖ నుంచి మాత్రం రూ.25 లక్షలు మంజూరైనా ఇప్పటివరకు జిల్లా అధికారుల ఖాతాల్లో జమ కాలేదు. ఆర్థిక శాఖ ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) రాక పోవడమే దీనికి కారణం.
మిగతా నిధులెలా..?
మంజూరైన 25 లక్షల నిధులను పక్కన పెడితే అధికంగా ఖర్చు చేసిన రూ.37లక్షల నిధులను సమకూర్చుకోవడం ఎలా అనే ప్రశ్న అధికారులను వేధిస్తోంది. నిధుల కోసం జిల్లా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ ఇవ్వాల్సిన నిధులే రాకపోతే ఇంకా అదనపు నిధులు ఎలా ఇస్తారన్న ప్రశ్న వారిని ఆందోళనలో పడేసింది. ఉత్సవ కమిటీ ఖాతాలో ఉన్న రూ.21 లక్షలు తీసి ఖర్చు పెట్టేందుకు వీల్లేదు. అడ్వాన్‌స తీసి మళ్లీ జమ చేసేయాలి. దీనిలో నుంచే అధికారులు రూ.19లక్షలు తీసి పలు బిల్లులు చెల్లించారు. మిగతా బిల్లుల కోసం పలువురు వ్యక్తులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. వారికేం చెప్పాలో తెలియక అధికారులు మధనపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Advertisement