గోడు వినేదెవరు?
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద పాక్షికంగా ముంపునకు గురైన కుక్కలగూడుర్ గ్రామాన్ని 10 రోజులుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వణికిస్తోంది. శివారులోని బుగ్గ ఒర్రె పొంగి ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపై దాదాపు 2 మీటర్ల ఎత్తులో వరద నీరు చేరింది. సమీప గ్రామాలకు రాకపోకలు స్తంభించింది. గ్రామస్తులు ప్రతి అవసరానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
-
కుక్కలగూడూర్ వాసుల అవస్థలు
-
తెప్పలపై ప్రయాణం
-
పదిరోజులుగా నిలిచిన రాకపోకలు
-
మునిగిన రక్షిత మంచినీటి బావులు
-
శ్మశానవాటికకు స్థలం కరువు
-
జాడలేని జిల్లా అధికారులు
బసంత్‌నగర్ : ‘శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ గ్రామంలోకి ప్రవేశించి పది రోజులైతాంది. మాకు కంటినిండా నిద్దుర కరువైంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గీత కార్మికులకు ఉపాధి పోయింది. తాగునీటి బావులు మునిగాయి. ఇళ్లలో పాములు వస్తున్నాయ్. కనీసం సచ్చినోళ్లను బొందపెడదామంటే జాగ లేకుండా అయింది. ఇన్ని అవస్థలు పడుతున్నా.. మాగోడు పట్టించుకునే వారే కరువయ్యారు’ ఇది రామగుండం మండలంలోని కుక్కలగూడుర్ గ్రామస్తుల ఆవేదన.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద పాక్షికంగా ముంపునకు గురైన కుక్కలగూడుర్ గ్రామాన్ని 10 రోజులుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వణికిస్తోంది. శివారులోని బుగ్గ ఒర్రె పొంగి ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపై దాదాపు 2 మీటర్ల ఎత్తులో వరద నీరు చేరింది. సమీప గ్రామాలకు రాకపోకలు స్తంభించింది. గ్రామస్తులు ప్రతి అవసరానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
వరద నీరు.. తెప్పలపై రాకపోకలు..
కుక్కలగూడుర్ గ్రామ శివారులోని బుగ్గ ఒర్రెపై గల వంతెన మునిగిపోవడంతో సమీపంలోని మద్దిర్యాల, పొట్యాల, సోమన్‌పల్లి, ఆకినపల్లి, బ్రాహ్మణపల్లి, అంతర్గాం, రామగుండం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతల వ్యవసాయ భూములు ఉన్న రైతులతోపాటు కూలి పనులకు వెళ్లే మహిళలు, పాఠశాల, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, గీత కార్మికులు, బ్యాంకుల ఖాతాదారులు, ప్రయాణికులు ఇలా ఒకటేమిటీ అందరూ అవస్తలు పడుతున్నారు. గ్రామంలో ముదిరాజ్ కులస్తులు ఏర్పాటు చేసిన మూడు లె ప్పల ద్వారా వరద నీటిలో ప్రయాణం చేస్తున్నారు. ఒక్కో మనిషికి రూ. 20 , ద్విచక్ర వాహనాలు దాటిస్తే రూ.100 చెల్లించుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు దాదాపు 3 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు.
ఐదు రోజులుగా నల్లాలు బంద్
గ్రామానికి రక్షిత మంచినీటిని అందించే రెండు బావులు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ఐదు రోజులుగా గ్రామంలో నల్లాలు బంద్ అయి స్థానికులకు రక్షిత మంచినీరు కరువైంది. ప్రస్తుతం గ్రామస్తులు నీటి కోసం సమీపంలోని బోరుబావులు, చేదబావులపై ఆధారపడుతున్నారు. వరద నీటి కారణంగా నీరంతా కలుషితమై రోగాల బారినపడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్మశాన వాటికకు స్థలం కరువు
గ్రామంలో శ్మశాన వాటికకూ స్థలం లేకుండా పోయింది. గతంలో నీరు లేనప్పుడు గ్రామంలో ఎవరూ చనిపోయినా.. బుగ్గ ఒర్రె వద్దకు తీసుకువచ్చి అంతక్రియలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఒర్రెతోపాటు చుట్టూ ఉన్న ప్రాంతమంతా నీటితో నిండిపోవడంతో శ్మశానవాటికకు స్థలం కరువైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థలంలేని కారణంగా గురువారం గ్రామంలో మృతిచెందిన సిద్ద పోశమ్మను శుక్రవారం వేంనూర్ గ్రామ శివారులోని మట్టికుప్పల వద్ద ఖననం చేయాల్సి వచ్చిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు కిలోమీటర్లు నడుస్తున్నాం..
– గాజుల సత్తయ్య, గీత కార్మికుడు
మేము కల్లుగీసి బతుకుతం. సగానికిపైగా చెట్లు నీటిలో మునిగిపోయాయి. ఉన్న చెట్లను గీద్దామంటే రోడ్డు మీదికి నీళ్లచ్చి రాకపోకలు బంద్ అయ్యాయి. తెప్పలపై పోదామంటే రూ.80 ఖర్చవుతున్నయ్. మూడు కిలోమీటర్లు పొలాల వెంట నడిచి వచ్చి కల్లు గీస్తున్నం. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు.
ఒక్క అధికారి కూడా రాలేదు
– ఎనగందుల సతీష్, స్థానికుడు
పదిరోజులుగా గ్రామస్తులమంతా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాం. రాత్రిళ్లు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నాం. ఐదు రోజులుగా నల్లా నీళ్లు బంద్ అయ్యాయి. అయినా ఇప్పటికి వరకు జిల్లా స్థాయి అధికారి ఒక్కరూ కూడా గ్రామాన్ని సందర్శించలేదు.