పింఛన్ కోసం పండుటాకుల పడిగాపులు
హిందూపురం అర్బన్ : వృద్ధులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ డబ్బుల కోసం పండుటాకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండితిప్పలు లేక పడిగాపులు కాస్తున్నారు. ఆకలికి తాళలేక కొందరు అరుగు కట్టలపైనే పడుకుండి పోతున్నారు. జన్మభూమి సభలు అని, వేలిముద్రలు పడటం లేదని పంపిణీ అధికారులు కాలయాపన చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
హిందూపురం పట్టణంలోని 38 వార్డుల్లో సుమారు 7,600 మందికి పైగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జనవరి మొదలై ఐదురోజులైనా పూర్తిస్థాయి పింఛన్ల పంపిణీ జరగలేదు. అయితే రెండు నెలలుగా పెద్దనోట్ల రద్దు కారణంగా చాలామంది వృద్ధులకు పింఛన్లు చేతికి అందలేదు. వీరందరూ రహమత్‌పురంలోని వెలుగు కార్యాలయం వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ఉన్నారు. జన్మభూమి సభ పూర్తయ్యేంత వరకు పంపిణీ నిలిపివేశారు. దీంతో మధ్యాహ్నం 1గంట దాటిపోయినా వృద్ధులకు పింఛన్ అందలేదు.