
103 ఏళ్ల బామ్మకు నాణేలతో తులాభారం
కొత్తకోట: నూరేళ్లు నిండిన వయసులోనూ నిక్షేపంలాంటి ఆరోగ్యంతో కనిపించేవారు చాలా అరుదు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన పొగాకు బసమ్మ 103 సంవత్సరాల వయస్సులోనూ ఉత్సాహంగా తన వారసులతో గడుపుతోంది. ఇప్పటికి కంటి అద్దాలు లేకుండా బసమ్మ పుస్తకాలు చదువుతూ పూజలు చేస్తూ పిల్లలకు స్లోకాలు నేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో కుమారుల, కుమార్తెలు సోమవారం రాత్రి కొత్తకోటలో అంగరంగ వైభవంగా బసమ్మకు రూపాయి నాణేలతో తులాభారం నిర్వహించారు.
వనపర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత పి.అయ్యప్ప తల్లి అయిన బసమ్మకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మొత్తం ఈమె కుటుంబంలో వందకు పైగా వారసులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీరంతా వివిధ హోదాల్లో స్థిర పడగా, ఈమె మనమలు, మనమరాళ్లు విదేశాలలో ఉంటున్నారు. కుమార్తె రాజమ్మ, అల్లుడు డాక్టర్ రవీందర్‌రావులు వారి ముచ్చట తీర్చుకునేందుకు బసమ్మను రూపాయి బిల్లలతో తులాభారం చేశారు.