పెన్షన్ కోసం వచ్చి మృత్యువాత
నూనెపల్లె: పెన్షన్ కోసం ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నంద్యాల రైల్వే స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుందని జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ మోడీ రంగ స్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్‌మ్యాన్‌గా డేరంగుల రంగయ్య (67).. ఏడేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. ఆయనకు పెన్షన్ అకౌంట్ నూనెపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో ఉంది. ఇతను సంజామల మండలంలోని అక్కంపల్లెలో కొన్ని రోజులు.. మరికొన్ని రోజులు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉండేవారు. బుధవారం పెన్షన్ కోసం వచ్చి.. బ్యాంక్ వద్ద నగదు తీసుకోలేక తిరిగి రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై రైల్వేస్టేషన్‌లోని బుకింగ్ కార్యాలయం వద్ద మృత్యువాత పడ్డారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద లభించిన బ్యాంక్‌బుక్ ఆధారంగా గుర్తించామని, రంగయ్య కుమారుడు వీరబ్రహ్మం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నామని జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.