
10న నేషనల్ మెగా లోక్ అదాలత్
లీగల్ (కడప అర్బన్ ): జిల్లాలోని వివిధ కోర్టుల పరిధిలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను సెప్టెంబర్ 10న జరిగే నేషనల్ మెగా లోక్ అదాలత్‌లో రాజీ చేసేందుకు ప్రతి పోలీసు అధికారి ప్రయత్నించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపు నిచ్చారు. బుధవారం సాయంత్రం జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ భవన్‌లో పోలీసు అధికారులతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో కాలంగా పోలీస్ స్టేషన్‌లలో దర్యాప్తు ప్రారంభించి కోర్టుల్లో విచారణ కొనసాగుతున్న కేసుల్లో నిబంధనల మేరకు రాజీ కాదగిన కేసులన్నీ వెంటనే రాజీ అయ్యేలా చూడాలన్నారు. సెప్టెంబర్ 3వ తేదీలోపు రాజీ అయ్యే కేసులన్నింటి వివరాల జాబితాను జిల్లా నలుమూలల నుంచి తీసుకుని రావాలన్నారు. రాజీ కేసుల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూ యూ ప్రసాద్, మెజిస్ట్రేట్‌లు జి. దీనా, శోభారాణి, భారతి, పోలీసు యంత్రాంగం నుంచి ఓఎస్‌డి (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు, కడప డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీసీఆర్‌బీ డీఎస్పీ నాగేంద్రుడు, సీఐలు రమేష్, మోహన్ ప్రసాద్, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.