
మళ్లీ పోరుకు సిద్ధం
- బాబు ఎన్నికల హామీని అమలు చేయాలి
- కమిషన్ నివేదికను బట్టి ఉద్యమ కార్యాచరణ
- కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం
ఖమ్మం అర్బన్: కాపులకు రిజర్వేషన్ల కోసం ఏపీలో అవసరమైతే మళ్లీ పోరాటానికి సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్ వెళుతూ ఖమ్మంలో కాసేపు ఆగారు. మున్నూరు కాపుసంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు ఇంట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిజర్వేషన్ అమలుకావాల్సి ఉండగా..చివరిదశలో ఆగిందని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను గెలిచిన ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని ఎన్నికల హామీనిచ్చి విస్మరించారని ఆరోపించారు. అమలు కోసం గతంలో తాను పోరాడానని, పిభ్రవరి 2న కళా వెంకటరావు, మంత్రి అచ్చంనాయుడును పంపించి కమిషన్ ద్వారా న్యాయం చేస్తామని ఈనెల చివరివరకు గడువు పెట్టారని, నివేదిక అనుకూలంగా లేకుంటే మళ్లీ పోరాటం తప్పదని హెచ్చరించారు. సెప్టెంబర్ 11న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమై..భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు వివరించారు. పేద కాపులకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, కేసులు పెట్టి బెదిరించినా, జైల్లో పెట్టినా న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, గతంలో ప్రజా ప్రతినిధిగా నాలుగు సార్లు గెలిచినా..ఏనాడూ డబ్బు, సారా పంచలేదని తెలిపారు. పవన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని, తాను మాత్రం ఉన్న రిజర్వేషన్ పునరుద్ధరించాలని పోరాడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, రాష< నాయకులు నల్లా విష్టు, ఆకుల రామకృష్ణ, జిల్లా నాయకులు శెట్టి రంగారావు, తోట రామారావు, కొత్తా సీతారాములు, ఆకుల గాంధీ, మాటేటి వీరభద్రం, పారా ఉదయ్, రాపర్తి శరత్ పాల్గొన్నారు.
పోటోరైటప్28సీకెఎం209: మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం