పుష్కర స్నానం.. పుణ్య ఫలం ! | one lakh peopel do pushkarabath | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానం.. పుణ్య ఫలం !

Published Sun, Aug 14 2016 12:40 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

పుష్కర స్నానం.. పుణ్య ఫలం ! - Sakshi

పుష్కర స్నానం.. పుణ్య ఫలం !

రెండో రోజు లక్ష మంది భక్తుల పుణ్యస్నానాలు
– ఇంకా నడుస్తున్న పుష్కరనగర్‌ పనులు
– ఘాట్ల వద్ద నిలువనీడ లేక అల్లాడుతున్న పిల్లలు, వద్ధులు
– ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌
– బోటులో పర్యవేక్షించిన ప్రత్యేకాధికారి, కలెక్టర్, ఎస్పీ
– సమస్యలపై ఆరా తీసిన కలెక్టర్‌
– భద్రత విషయంలో రాజీవద్దని ఎస్పీ ఆదేశాలు
 
అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్‌.. చుట్టూ ఎత్తయిన కొండలు. చల్లని గాలి.. కృష్ణమ్మ పరవళ్లతో పుష్కర సంబరం భక్తుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటోంది. ప్రాంతాలు.. కులమతాలకు అతీతంగా భక్తులకు నదీమ తల్లి ఆహ్వానం పలుకుతోంది. అడుగడుగునా భద్రత.. అధికారుల అప్రమత్తత నడుమ పుష్కర ఘాట్‌ల వద్ద భక్తిపారవశ్యం పొంగిపొర్లుతోంది.
 
శ్రీశైలం నుంచి సాక్షి ప్రతినిధి:
వరుస సెలవుల నేపథ్యంలో జిల్లాలో పుష్కర సందడి రెట్టింపవుతోంది. మొదటి రోజుతో పోలిస్తే.. రెండవ రోజు శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. సుమారు లక్ష మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. ప్రధానంగా మహారాష్ట్ర.. కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటం విశేషం. ఇకపోతే ప్రభుత్వం యంత్రాంగం కూడా భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరాములు, జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌లు ఘాట్ల వద్దకు వచ్చి భక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆ మేరకు సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా సంగమేశ్వరంలో భద్రతా చర్యలను ఐజీ శ్రీధర్‌రావు పర్యవేక్షిస్తుండగా.. శ్రీశైలంలో ఎస్పీ ఆకె రవికష్ణ మాస్టర్‌ కంట్రోల్‌ రూం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాతాళగంగ, లింగాలగట్టు వద్ద ముగ్గురు అధికారులు బోటులో ప్రయాణించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీశైలంలోని వివిధ సంత్రాల వద్ద నుంచే లింగాలగట్టు వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అయితే పిల్లలు, వద్ధులకు నిలువ నీడ లేకపోవడం ఇబ్బందులకు తావిస్తోంది. ఘాట్ల వద్ద పిల్లలకు బిస్కెట్లు కూడా లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్‌ భక్తులు సేదతీరేందుకు తాత్కాలిక షెడ్లను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలాఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులను రవాణా శాఖ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తాము సైతం అంటూ హిజ్రాలు పాతాళగంగలో పుణ్యస్నానం ఆచరించారు.
 
భక్తుల చెంతకే బస్సులు
ఘాట్ల వద్దకు భక్తులను చెరవేసేందుకు అధికార యంత్రాంగం మరిన్ని చర్యలు చేపట్టింది. మొదటిరోజు లింగాలగట్టులోని ఎగువఘాటు వరకే శ్రీశైలం నుంచి ఉచిత బస్సులను నడిపారు. అయితే, దిగువఘాటు వద్దకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో.. శుక్రవారం ఉచిత బస్సుల సర్వీసులను ఘాటు కింద వరకూ పొడిగించారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో దిగువఘాటుకు వెళ్లి స్నానాలు ఆచరించారు. అదేవిధంగా శ్రీశైలంలోని వివిధ సత్రాల్లో ఉంటున్న భక్తులు నడిచివెళ్లి ఊరు వెలుపల ఏర్పాటు చేసిన బస్టాండు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో ఉన్న వివిధ సత్రాల మార్గంలో ఉచిత బస్సు సర్వీసులను నడిపారు. ఫలితంగా తాము బస చేసిన సత్రం నుంచే ఘాటు వద్దకు వెళ్లేందుకు అవకాశం ఉండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
మఫ్టీలో నిఘా
రేయింబవళ్లు కాపలా కాస్తూ బైనాక్యులర్లతో పాటు వాకీటాకీలు, విజిల్స్‌ ద్వారా పోలీసు సిబ్బంది నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆలయం చుట్టూ భారీస్థాయిలో పర్యవేక్షణ చేపడుతోంది. జిల్లాలోని అన్ని ఘాట్ల వద్ద సామాన్య భక్తుల తరహాలో కలిసిపోయి రక్షణకు ఉపక్రమించారు. ఇక లింగాలగట్టు ఘాటు వద్ద ఎతై ్తన ప్రదేశంలో బైనాక్యులర్‌తో నిఘా ఉంచారు.
 
ఇవీ ఇబ్బందులు..
ఘాటు వరకు బస్సు సర్వీసుతో పాటు వద్ధులు, వికలాంగులకు వీల్‌చైర్లను ఏర్పాటు చేసినా.. ఘాటు వద్ద కూర్చునేందుకు నీడ కల్పించలేకపోయారు.
– స్నానం చేసిన తర్వాత ఘాట్ల వద్ద కాసేపు సేద తీరేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చిన్న పిల్లలతో వచ్చిన భక్తులతో పాటు వద్ధులు ఇబ్బందులు పడ్డారు. 
– లింగాలగట్టులోని కిందిఘాటు వద్ద పార్కింగ్‌ ప్రాంతంలో భారీ సంఖ్యలో కార్లు, మినీ బస్సులు వస్తున్నాయి. అయితే, ఈ వాహనాలను పరిశీలించేందుకు లో మిర్రర్‌ మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేయలేదు.
– ఘాట్ల వద్ద తినుభండారాలు లభించడం లేదు. టీ, బిస్కెట్‌ వంటివి కూడా దొరకట్లేదు.
– లింగాలగట్టులోని కింది ఘాటు వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది. అయితే, స్త్రీలు దుస్తులు మార్చుకునేందుకు కేవలం రెండే షెడ్లు ఉన్నాయి. దీంతో కొద్ది మంది బయటే దుస్తులు మార్చుకోవాల్సి వస్తోంది.
 
రవాణా.. వేధింపులు!
ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు రవాణా శాఖ సిబ్బందితో కొత్త సమస్య వచ్చి పడుతోంది. సున్నిపెంటకు సమీపంలో ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టు వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి వాహనాన్ని ఆర్‌టీఓ అధికారులు నిలిపి పరిశీలిస్తున్నారు. సొంత వాహనాల్లో(తెల్ల నెంబరు ప్లేటు) ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రవాణా శాఖ అధికారుల చర్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లో నెంబరు ప్లేటు ఉన్న వాహనాలను నిలిపి.. నిబంధనల మేరకు పన్ను వసూలు చేస్తే ఇబ్బంది లేదని.. తెల్ల నెంబరు ప్లేటు ఉన్నప్పటికీ వేధించడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు వాపోతున్నారు.  
 
 
భక్తులే ప్రచారకర్తలు: కలెక్టర్‌
కష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తెలిపారు. పాతాళగంగ, లింగాలగట్టు పుష్కర ఘాట్లను పరిశీలించిన అనంతరం ఏర్పాట్ల వివరాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. జిల్లాలో మొదటిరోజు పుష్కర స్నానాలు కూల్‌గా ప్రారంభమయ్యాయని.. శనివారం రోజు టేకాఫ్‌ అయ్యాయన్నారు. వరుసగా సెలవు దినాలు కావడంతో రోజుకు 3లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అటువైపు తెలంగాణ ఘాట్‌తో పోలిస్తే ఇక్కడే భక్తులు అధికంగా ఉన్నారన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులే తమకు ప్రచారకర్తలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న భక్తులు కూడా ఇక్కడే స్నానం చేయడం చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఏ ఒక్కరూ అసంతప్తిగా వెళ్లకుండా చూసుకుంటున్నామన్నారు. అందుకే సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ స్నానమాచరించిన ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వారికి పుష్కరస్నానానికి వెళ్లండి... ఎటువంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారని అందుకే రద్దీ క్రమంగా పెరుగుతోందన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement