కర్నూలు: కర్నూలు మండలం ఉల్చాల గ్రామ శివారుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కురువ లక్ష్మణస్వామి (35) అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డెపల్లి మండలం ముండ్లదిన్నె గ్రామానికి చెందిన ఇతనికి కర్నూలు జిల్లా. రేమట గ్రామానికి చెందిన కుర్వ రామేశ్వరితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈయనకు ఇద్దరు సంతానం. బుధవారం స్వగ్రామానికి వెళ్లేందుకు రేమట నుంచి ఆటోలో ఉల్చాలకు వచ్చాడు. అక్కడ పని ముగించుకొని మళ్లీ ఆటో కోసం రోడ్డు దాటుతుండగా కర్నూలు–2డిపోకు చెందిన ఏపీ 28 జడ్ 5078 బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తాలూకా ఎస్‌ఐ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుని బావ కురువ రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.