అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) గురువారం స్థానిక గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్‌లో ప్రారంభమైంది. జిల్లాకు మొత్తం 32 వేల జవాబుపత్రాలు వచ్చాయి. ఈ నెల 30 వరకు స్పాట్ కొనసాగే అవకాశముంది. ఇందుకోసం 200 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 30 మంది చీఫ్ ఎగ్జామినర్లు, ఆరుమంది ఏసీఓలు, 40 మందిని స్క్రూటనైజర్లను నియమించారు. క్యాంపు ఆఫీసర్‌గా డీఈఓ, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్‌గా గోవిందునాయక్ వ్యవహరిస్తారు. తొలిరోజు డెప్యూటీ క్యాంపు ఆఫీసర్ గోవిందునాయక్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు.