open inter
-
అంతా ఓపెన్
ఏ సబ్జెక్టు రాస్తున్నారో తెలియదు.. ఏ ప్రశ్న ఇస్తారో తెలియదు.. అసలు సిలబస్ అంటే ఏంటో తెలియదు.. పరీక్ష రాస్తున్నామనే భయం అంతకన్నా ఉండదు.. ఎందుకంటే పరీక్ష రాయకముందే పాస్ గ్యారంటీ.. దీనికిగాను ముందస్తుగా చెల్లించిన లంచాలే వాళ్ల ధైర్యానికి వారంటీ.. అందుకే ఓపెన్‌గా పరీక్ష రాస్తారు. తాపీగా కాపీలు కొట్టేస్తారు. కట్టడి చేయాల్సిన ఇన్విజిలేటర్లే కట్టలుకట్టలు చీటీలు అందిస్తారు. వారికి అందిన మామూళ్లను బట్టి బుక్స్ కూడా ఇచ్చేసి దగ్గరుండి కాపీలు కొట్టిస్తారు. అభ్యర్థుల అవసరాలే ఆసరాగా ఓపెన్ స్కూల్ ఏజెన్సీల నిర్వాహకులు ఈ దందా కొనసాగించారు. పరీక్ష హాలులో చీటీలు ఇచ్చేందుకు ఒక రేటు, టెక్ట్స్ బుక్స్ ఇచ్చేందుకు మరో రేటు, అభ్యర్థికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసేందుకు ఇంకో రేటు చొప్పున వసూలు చేశారు. ఇందులో విద్యాశాఖ అధికారులకు వాటాలు ఇచ్చి వారి కళ్లకు గంతలు కట్టారు. మొత్తంగా ఓపెన్ పరీక్షను చూచిరాతల పరీక్షగా మార్చేశారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు చూచిరాతలను తలపించాయి. జిల్లా వ్యాప్తంగా టెన్త్, ఇంటర్ కలిపి 33 కేంద్రాల్లో 13,206 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. శుక్రవారంతో జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా జరగాల్సిన పరీక్షలు పూర్తిగా పక్కదారి పట్టాయి. విద్యాశాఖ పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్ష రాసేవారికి పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు అత్యవసరం కావడంతో ఎంత వరకైనా సిద్ధమవుతున్నారు. విద్యార్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న స్కూల్ ఏజెన్సీలు పాస్ గ్యారంటీపేరుతో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డాయి. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రాన్ని అందిస్తారు. అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా జవాబు పత్రంలో సమాధానాలు రాయాలి. కానీ జిల్లాలో జరిగిన ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లు దగ్గరుండి విద్యార్థులకు చీటీలు ఇచ్చి మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్విజిలేటర్లతోపాటు పరీక్ష కేంద్రాల్లోని సిబ్బంది సహకారం ఉండడంతో విద్యార్థుల పెన్నులు జోరుగా దూసుకెళ్లాయి. ఓపెన్ స్కూల్ సెంటర్ల నిర్వాహకులు పరీక్ష కేంద్రాల వద్ద తిష్టవేసి మరీ చూచిరాతల పక్రియను కొనసాగించారు. ఇన్విజిలేటర్లకు తాయిలాలు ముట్టజెప్పి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేలా ఒప్పందం కుదుర్చుకుని మరో వైపు జంబ్లింగ్ విధానం లేకపోవటం కూడా ఇన్విజిలేటర్లకు కలిసొచ్చింది. శుక్రవారం జరిగిన చివరి టెన్త్ పరీక్ష సందర్భంగా గుంటూరు నగరంలోని ఎల్ఈఎం స్కూల్లో ఇద్దరు విద్యార్థులను డీబార్ చేశారు. ఫీజుకు అదనంగా వసూళ్లు.. ఓపెన్‌లో టెన్త్ చదివే విద్యార్థులకు సాధారణంగా రూ.750 దాకా ఫీజు ఉంటుంది. నేరుగా అభ్యర్థులు ఫీజు కట్టకుండా తమ ద్వారా పరీక్షలు రాస్తే పాస్ గ్యారంటీ అంటూ ప్రైవేట్ ఏజెన్సీలు ఆఫర్లు ఇస్తున్నాయి. పరీక్ష రాసేటప్పుడు ఇచ్చే వెసులుబాటును బట్టి రేట్లను ఫిక్స్ చేస్తున్నారు. స్లిప్‌లు పెట్టి రాయిస్తే ఒక రేటు, టెక్టŠస్ బుక్స్ చేతికిచ్చి రాయిస్తే మరో రేటు నిర్ణయిస్తున్నారు. మరి కొన్ని ఏజెన్సీలైతే అసలు వ్యక్తి బదులు మరో వ్యక్తితో పరీక్ష రాసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీనికిగాను భారీ స్థాయిలో వసూలు చేసుతన్నాయి. వసూళ్లకోసం ప్రత్యేకంగా కొంత మందిని నియమించుకొని దందా నడుపుతున్నాయి. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజు రూపంలో వసూల్ చేస్తున్నారని సమాచారం. ఇందులో పరీక్ష కేంద్రం నిర్వాహకులకు, విద్యాశాఖాధికారులకు కూడా మామూళ్లు అందుతున్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య అవగాహనతోనే.. ప్రైవేట్ స్కూల్ ఏజెన్సీలు, విద్యాశాఖ అధికారుల మధ్య అవగాహనతోనే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్ ఏజెన్సీలు పాస్ గ్యారంటీ పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్టు వదిలేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పకడ్బందీగా నిర్వహించాం.. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డ విద్యార్థులను డీబార్ చేశాం. ప్రైవేట్ స్కూల్ ఏజెన్సీలు వసూళ్లకు పాల్పడిన విషయం మా దృష్టికి రాలేదు. – శ్రీధర్, ఏపీఓఎస్ఎస్, కో–ఆర్డినేటర్ గుంటూరు, కృష్ణా -
ఓపెన్ ఇంటర్ ‘స్పాట్’ ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) గురువారం స్థానిక గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్లో ప్రారంభమైంది. జిల్లాకు మొత్తం 32 వేల జవాబుపత్రాలు వచ్చాయి. ఈ నెల 30 వరకు స్పాట్ కొనసాగే అవకాశముంది. ఇందుకోసం 200 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 30 మంది చీఫ్ ఎగ్జామినర్లు, ఆరుమంది ఏసీఓలు, 40 మందిని స్క్రూటనైజర్లను నియమించారు. క్యాంపు ఆఫీసర్‌గా డీఈఓ, డెప్యూటీ క్యాంపు ఆఫీసర్‌గా గోవిందునాయక్ వ్యవహరిస్తారు. తొలిరోజు డెప్యూటీ క్యాంపు ఆఫీసర్ గోవిందునాయక్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. -
25 నుంచి ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు తరగతులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బీక్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు(సైన్సు గ్రూపు) ఈనెల 25 నుంచి ప్రతి ఆదివారం, రెండో శనివారం తరగతులను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8 నుంచి 1.30 గంటల వరకు తరగతులను ఉంటాయని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇస్తామని చెప్పారు. -
ఓపెన్ ఇంటర్ పాసైతే బీ ఫార్మసీకి అర్హులు
జోగిపేట: ఓపెన్ ఇంటర్ పాసైన అభ్యర్థులు బీ ఫార్మసీ కోర్సులో చేరేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం జోగిపేట బాలుర ఉన్నత పాఠశాలలోని ఓపెన్ స్కూల్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీ ఫార్మసీ తోపాటు టీటీసీ, బీటెక్ అర్హత పరీక్షలను కూడా రాసుకోవచ్చుని తెలిపారు. ఆర్థిక, సామాజిక ఇబ్బందుల కారణంగా మధ్యలో చదువు మానేసి 14 సంవత్సరాలు పైబడిన వారు పదవతరగతి, ఇంటర్లో ఓపెన్ స్కూల్లో చేరవచ్చునని తెలిపారు. ఈ నెల 30వ వరకు అడ్మిషన్లకు గడువు పది, ఇంటర్ ఓపెన్ స్కూల్లో చేరేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉందన్నారు. పదవ తరగతిలో చేరేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రూ. 600 మాత్రమే చెల్లించాలని, ఓపెన్ కేటగిరి పురుషులకు రూ. 1000 చొప్పున చెల్లించాలన్నారు. ఇంటర్మీడియేట్‌లో చేరేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రూ. 800 మాత్రమే చెల్లించాలని, ఓపెన్ కేటగిరి పురుషులకు రూ. 1100 చొప్పున చెల్లించాలన్నారు. జోగిపేట, సంగారెడ్డి ఓపెన్ కేంద్రంలోని సైన్స్ గ్రూపుల్లో అదనంగా 40 చొప్పున సీట్లు పెంచినట్లు వెంకట స్వామి తెలిపారు. ఇప్పటి వరకు పదవ తరగతిలో 3,348 మంది, ఇంటర్లో 3,658 మంది చేరినట్లు తెలిపారు. ఒక్క సారి ఫీజు కడితే 9సార్లు పరీక్ష రాయవచ్చని అన్నారు. వివరాలకు ఫోన్నం. 80084 03635లో సంప్రదించవచ్చని సూచించారు. అక్టోబర్ 10 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 10వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెంకటస్వామి తెలిపారు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు గతంలో వివిధ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారు హాజరవుతారన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5 గంటలకు పరీక్షలు జరుగుతాయన్నారు. -
ఓపెన్ స్కూళ్లలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. నేడు (ఆదివారం) పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో 10 కేంద్రాల్లో ఇంటర్ వన్ సెట్టింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. సీఎస్ఐ పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని సమాచారం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకుంది. అయితే అధికారులు మీడియాలను లోపలికి అనుమతించలేదు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.