జోగిపేట: ఓపెన్ ఇంటర్ పాసైన అభ్యర్థులు బీ ఫార్మసీ కోర్సులో చేరేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం జోగిపేట బాలుర ఉన్నత పాఠశాలలోని ఓపెన్ స్కూల్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీ ఫార్మసీ తోపాటు టీటీసీ, బీటెక్ అర్హత పరీక్షలను కూడా రాసుకోవచ్చుని తెలిపారు. ఆర్థిక, సామాజిక ఇబ్బందుల కారణంగా మధ్యలో చదువు మానేసి 14 సంవత్సరాలు పైబడిన వారు పదవతరగతి, ఇంటర్‌లో ఓపెన్ స్కూల్‌లో చేరవచ్చునని తెలిపారు.
ఈ నెల 30వ వరకు అడ్మిషన్లకు గడువు
పది, ఇంటర్ ఓపెన్ స్కూల్‌లో చేరేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉందన్నారు. పదవ తరగతిలో చేరేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 100, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ మైనార్టీలకు రూ. 600 మాత్రమే చెల్లించాలని, ఓపెన్ కేటగిరి పురుషులకు రూ. 1000 చొప్పున చెల్లించాలన్నారు. ఇంటర్మీడియేట్‌లో చేరేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ మైనార్టీలకు రూ. 800 మాత్రమే చెల్లించాలని, ఓపెన్ కేటగిరి పురుషులకు రూ. 1100 చొప్పున చెల్లించాలన్నారు.
జోగిపేట, సంగారెడ్డి ఓపెన్ కేంద్రంలోని సైన్స్ గ్రూపుల్లో అదనంగా 40 చొప్పున సీట్లు పెంచినట్లు వెంకట స్వామి తెలిపారు. ఇప్పటి వరకు పదవ తరగతిలో 3,348 మంది, ఇంటర్‌లో 3,658 మంది చేరినట్లు తెలిపారు. ఒక్క సారి ఫీజు కడితే 9సార్లు పరీక్ష రాయవచ్చని అన్నారు. వివరాలకు ఫోన్‌నం. 80084 03635లో సంప్రదించవచ్చని సూచించారు.
అక్టోబర్ 10 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
అక్టోబర్ 10వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెంకటస్వామి తెలిపారు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు గతంలో వివిధ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారు హాజరవుతారన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5 గంటలకు పరీక్షలు జరుగుతాయన్నారు.
ఓపెన్ ఇంటర్ పాసైతే బీ ఫార్మసీకి అర్హులు
Published Mon, Sep 28 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM
Advertisement