అంతా ఓపెన్‌ | Mass Copying in Guntur Open Inter And Tenth Exams | Sakshi
Sakshi News home page

అంతా ఓపెన్‌

Published Sat, May 11 2019 1:05 PM | Last Updated on Sat, May 11 2019 1:05 PM

Mass Copying in Guntur Open Inter And Tenth Exams - Sakshi

ఏ సబ్జెక్టు రాస్తున్నారో తెలియదు.. ఏ ప్రశ్న ఇస్తారో తెలియదు.. అసలు సిలబస్‌ అంటే ఏంటో  తెలియదు.. పరీక్ష రాస్తున్నామనే భయం అంతకన్నా ఉండదు.. ఎందుకంటే పరీక్ష రాయకముందే పాస్‌ గ్యారంటీ.. దీనికిగాను ముందస్తుగా చెల్లించిన లంచాలే వాళ్ల ధైర్యానికి వారంటీ.. అందుకే ఓపెన్‌గా పరీక్ష రాస్తారు. తాపీగా కాపీలు కొట్టేస్తారు. కట్టడి చేయాల్సిన ఇన్విజిలేటర్లే కట్టలుకట్టలు చీటీలు అందిస్తారు. వారికి అందిన మామూళ్లను బట్టి బుక్స్‌ కూడా ఇచ్చేసి దగ్గరుండి కాపీలు కొట్టిస్తారు. అభ్యర్థుల అవసరాలే ఆసరాగా ఓపెన్‌ స్కూల్‌ ఏజెన్సీల నిర్వాహకులు ఈ దందా కొనసాగించారు. పరీక్ష హాలులో చీటీలు ఇచ్చేందుకు ఒక రేటు, టెక్ట్స్‌ బుక్స్‌ ఇచ్చేందుకు మరో రేటు, అభ్యర్థికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసేందుకు ఇంకో రేటు చొప్పున వసూలు చేశారు. ఇందులో విద్యాశాఖ అధికారులకు వాటాలు ఇచ్చి వారి కళ్లకు గంతలు కట్టారు. మొత్తంగా ఓపెన్‌ పరీక్షను చూచిరాతల పరీక్షగా మార్చేశారు.    

సాక్షి, గుంటూరు: జిల్లాలో ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు చూచిరాతలను తలపించాయి. జిల్లా వ్యాప్తంగా టెన్త్, ఇంటర్‌ కలిపి 33 కేంద్రాల్లో 13,206 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. శుక్రవారంతో జిల్లాలో ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా జరగాల్సిన పరీక్షలు పూర్తిగా పక్కదారి పట్టాయి. విద్యాశాఖ పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం పరీక్ష రాసేవారికి పదో తరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లు అత్యవసరం కావడంతో ఎంత వరకైనా సిద్ధమవుతున్నారు. విద్యార్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న స్కూల్‌ ఏజెన్సీలు పాస్‌ గ్యారంటీపేరుతో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డాయి.

పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌ ప్రశ్నాపత్రాన్ని అందిస్తారు. అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా జవాబు పత్రంలో సమాధానాలు రాయాలి. కానీ జిల్లాలో జరిగిన ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో ఇన్విజిలేటర్లు దగ్గరుండి విద్యార్థులకు చీటీలు ఇచ్చి మాస్‌ కాపీయింగ్‌కు ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్విజిలేటర్లతోపాటు పరీక్ష కేంద్రాల్లోని సిబ్బంది సహకారం ఉండడంతో విద్యార్థుల పెన్నులు జోరుగా దూసుకెళ్లాయి. ఓపెన్‌ స్కూల్‌ సెంటర్ల నిర్వాహకులు పరీక్ష కేంద్రాల వద్ద తిష్టవేసి మరీ చూచిరాతల పక్రియను కొనసాగించారు. ఇన్విజిలేటర్లకు తాయిలాలు ముట్టజెప్పి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేలా ఒప్పందం కుదుర్చుకుని మరో వైపు జంబ్లింగ్‌ విధానం లేకపోవటం కూడా ఇన్విజిలేటర్లకు కలిసొచ్చింది. శుక్రవారం జరిగిన చివరి టెన్త్‌ పరీక్ష సందర్భంగా గుంటూరు నగరంలోని ఎల్‌ఈఎం స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులను డీబార్‌ చేశారు.

ఫీజుకు అదనంగా వసూళ్లు..
ఓపెన్‌లో టెన్త్‌ చదివే విద్యార్థులకు సాధారణంగా రూ.750 దాకా ఫీజు ఉంటుంది. నేరుగా అభ్యర్థులు ఫీజు కట్టకుండా తమ ద్వారా పరీక్షలు రాస్తే పాస్‌ గ్యారంటీ అంటూ ప్రైవేట్‌ ఏజెన్సీలు ఆఫర్‌లు ఇస్తున్నాయి. పరీక్ష రాసేటప్పుడు ఇచ్చే వెసులుబాటును బట్టి రేట్లను ఫిక్స్‌ చేస్తున్నారు. స్లిప్‌లు పెట్టి రాయిస్తే ఒక రేటు, టెక్టŠస్‌ బుక్స్‌ చేతికిచ్చి రాయిస్తే మరో రేటు నిర్ణయిస్తున్నారు. మరి కొన్ని ఏజెన్సీలైతే అసలు వ్యక్తి బదులు మరో వ్యక్తితో పరీక్ష రాసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీనికిగాను భారీ స్థాయిలో వసూలు చేసుతన్నాయి. వసూళ్లకోసం ప్రత్యేకంగా కొంత మందిని నియమించుకొని దందా నడుపుతున్నాయి. ఒక్కో అభ్యర్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజు రూపంలో వసూల్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో పరీక్ష కేంద్రం నిర్వాహకులకు, విద్యాశాఖాధికారులకు కూడా మామూళ్లు అందుతున్నట్లు తెలిసింది.

ఇద్దరి మధ్య అవగాహనతోనే..
ప్రైవేట్‌ స్కూల్‌ ఏజెన్సీలు, విద్యాశాఖ అధికారుల మధ్య అవగాహనతోనే ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్‌ ఏజెన్సీలు పాస్‌ గ్యారంటీ పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్టు వదిలేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు          మండిపడుతున్నారు.

పకడ్బందీగా నిర్వహించాం..
ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డ విద్యార్థులను డీబార్‌ చేశాం. ప్రైవేట్‌ స్కూల్‌ ఏజెన్సీలు వసూళ్లకు పాల్పడిన విషయం మా దృష్టికి రాలేదు.  – శ్రీధర్, ఏపీఓఎస్‌ఎస్, కో–ఆర్డినేటర్‌ గుంటూరు, కృష్ణా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement