చీటీలను చూపుతున్న డాక్టర్ నాగేశ్వరమ్మ నర్సింగ్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
స్థానిక వైద్య కళాశాలలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) వార్షిక పరీక్షలకు నర్సింగ్ విద్యార్థులు చీటీలతో హాజరవుతున్నారు. పరీక్షల చీఫ్ ఎగ్జామినర్ డాక్టర్ సిద్ధాబత్తుని నాగేశ్వరమ్మ బుధవారం కొంత మంది విద్యార్థుల వద్ద చీటీలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి చీటీలతో హాలులోకి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష హాలులోకి బూట్లు, సాక్సులు వేసుకురావద్దని ఆదేశించారు.
గుంటూరు మెడికల్: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) వార్షిక పరీక్షలకు హాజరయ్యే నర్సింగ్ విద్యార్థులు రోజూ చీటీలతో పరీక్షా హాలులోకి ప్రవేశిస్తున్నారు. దీంతో బుధవారం తనిఖీలు నిర్వహించిన పరీక్షల చీఫ్ ఎగ్జామినర్ డాక్టర్ సిద్ధాబత్తుని నాగేశ్వరమ్మ పలువురు విద్యార్థుల వద్ద చీటీలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి చీటీలతో హాలులోకి వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు బూట్లు, సాక్సుల్లో చీటీలను పెట్టుకుని వస్తున్నట్లు అనుమానం రావటంతో హాలులోకి బూట్లు, సాక్సులు లేకుండా హాజరవ్వాలని ఆదేశాలిచ్చారు. పలువురు సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల దగ్గర ఏమైనా చీటీలు ఏమైనా ఉన్నాయోమోనని తనిఖీ చేయించారు.
ఈనెల ఒకటో తేదీ నుంచి జీఎన్‌ఎం వార్షిక పరీక్షలు గుంటూరు వైద్య కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈనెల 13 వరకు థియరీ, 15 నుంచి 23వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 ప్రైవేటు నర్సింగ్ స్కూల్స్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్న ఈ పరీక్షలకు విద్యార్థులు రోజూ చీటీలను తీసుకురావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిర్వాహణ బాధ్యతలను ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌కు అప్పగించారు. కొంత మంది కార్యాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లుగా నియమించి నర్సింగ్ స్కూల్ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ వారికి లోపాయికారీ ఒప్పందాలు ఉండటం వల్లే విద్యార్థులు భయం, బెరుకు లేకుండా చీటీలను పరీక్ష హాలులోకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలో నర్సింగ్ నిబంధనల ప్రకారం బోధనా సిబ్బంది, ప్రాక్టికల్స్ చేసే సౌకర్యాలు ఉండవు. కానీ ఆ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత రావటంపై వైద్య సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు స్కూల్ విద్యార్థులను పరీక్షల సమయంలో చూసీచూడనట్లు వదిలివేయటం వల్లే వారికి మంచి ఫలితాలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment