అవకాశమా.. అవమానమా!
అవకాశమా.. అవమానమా!
Published Mon, May 29 2017 11:04 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
- జిల్లా అధ్యక్షుడిగా సోమిశెట్టి పేరు ప్రకటించని పార్టీ అధిస్ఠానం
- మినీ మహానాడు నిర్వహణకు దూరం
- ఆఖరి నిమిషయంలో చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు నిర్వహణ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఊరిస్తూ ఊసురుమనిపిస్తోంది. గతంలో జిల్లా పార్టీ మొత్తం సోమిశెట్టి పేరునే ప్రతిపాదించగా... అకస్మాత్తుగా శిల్పా చక్రపాణి రెడ్డిని అధిష్టానం నియమించింది. ఇప్పుడు సోమిశెట్టినే జిల్లా అధ్యక్షుడు అంటూ స్వయంగా పార్టీ ఇన్‌చార్జీలు పేర్కొన్నప్పటికీ చివరి నిమిషయంలో ఆయన పేరును ప్రకటించకపోవడం గమనార్హం. వాస్తవానికి మినీ మహానాడును అధ్యక్ష పదవి హోదాలో సోమిశెట్టినే నిర్వహించాలని మొదట్లో వర్తమానం వచ్చింది. ఇందుకోసం ఆయన కూడా అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, కొన్ని గంటల్లో మినీ మహానాడు ప్రారంభం కాబోతుండగా... మొత్తం నిర్వహణ అంతా చక్రపాణి రెడ్డినే చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. దీంతో సోమిశెట్టి మిన్నకుండిపోయారు.
తెరపైకి బీసీ, రెడ్డి వర్గీయులు
వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న చక్రపాణి రెడ్డికి శాసన మండలి చైర్మన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో జిల్లా అధ్యక్షుడి మార్పు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిల పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే, ఇందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేయలేదు. అదేవిధంగా జిల్లాలోని నేతలందరూ సోమిశెట్టికే ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అదే సందర్భంలో అటు కర్నూలు పార్లమెంటు ఇన్‌చార్జ్ సుజనా చౌదరి కూడా సోమిశెట్టికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు వర్తమానం పంపారు. మినీ మహానాడును కూడా సోమిశెట్టి ఆధ్వర్యంలోనే చేపట్టాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా అధ్యక్ష హోదాలో సోమిశెట్టి అందరికీ మినీ మహానాడు వర్తమానం కూడా పంపారు. నగరం మొత్తం ఆయన పేరుతో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అయితే, చివరి నిమిషయంలో మళ్లీ చక్రపాణి రెడ్డినే నిర్వహించాలని కబురు రావడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే, అన్ని జిల్లాలతో పాటు కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి కూడా ప్రకటిస్తారని..అది సోమిశెట్టికే వస్తుందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే, రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉందని మరో వర్గం వాదిస్తోంది. మొత్తం మీద గతంలో మాదిరిగానే ఆయనకు మొండిచేయి చూపిస్తారా? పట్టం కడతారో చూడాల్సి ఉంది.
Advertisement
Advertisement