టీడీపీ నేతలకు సిగ్గూశరం లేదు
నల్లగొండ టుటౌన్ : తెలంగాణలో కరెంట్ కష్టాలకు ఏపీ సీఎం చంద్రబాబే కారణమని తెలిసినా ఆ పార్టీ నేతలు బుద్ధి, సిగ్గూశరం లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఆయన దుబ్బాక నర్సింహారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వారు ఏ విధంగా తిరగబడతారో ఇప్పటికైనా టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ నేతలకు పోలీసులు రక్షణ కల్పించకపోతే ప్రజలు తరిమికొట్టేవారని పేర్కొన్నారు.
పంటలు ఎండి రైతులు నష్టపోతుంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని కృష్ణా బోర్డుకు చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రాజెక్టులో 838 అడుగుల నీరు ఉన్నంత వరకు ఉపయోగించుకోవచ్చని చంద్రబాబే జీఓ తెచ్చిన విషయం టీడీపీ నేతలు గమనించాలన్నారు. కేసీఆర్ కుటుంబంపై బూతులు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం తమకు వచ్చని, కానీ సంస్కారం అడ్డువస్తుందన్నారు. మోత్కుపల్లి మొరిగి, మొరిగి ఖమ్మం వెళ్లాడని, అక్కడి ప్రజలు కూడా చీదరించుకోవడంతో ఇక్కడి వచ్చాడని తెలిపారు. కరెంట్ కష్టాలకు చంద్రబాబు కారణమైతే ముక్కు నెలకు రాస్తానన్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కరెంట్ కష్టాలను తీసుకువచ్చింది ఎవరో తెలి యదా అని ప్రశ్నించారు. టీడీపీ వైపు ప్రజలు లేకపోవడంతోనే బంద్ ఘోరం గా విఫలమైందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు.
టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సిం హారెడ్డి మాట్లాడుతూ కరెంట్ కోసం పోరాడితే బషీర్‌బాగ్‌లో ముగ్గురిని కాల్చి పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి ఆపేయడం చూసి తట్టుకోలేకనే నల్లగొండ నియోజకవర్గ రైతులు టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారన్నారు. టీడీపీ నేతలు ఇదే విధంగా వ్యవహరిస్తే హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంపైనే రైతులు దాడి చేస్తారని హెచ్చరించారు. కరెంట్ కష్టాలు సృష్టిస్తున్న టీడీపీ ఇక్కడ నిరసన సభ ఏలా నిర్వహిస్తారో చూస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు షేక్ కరీంపాష, జమాల్‌ఖాద్రీ, సైదులు, గణేష్ పాల్గొన్నారు.