banda narender reddy
-
సీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలి
నల్లగొండ టుటౌన్ : జిల్లా అభివృద్ధికి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి కోరారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో ఆయన మాట్లాడుతూ 8న చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పథకానికి, నక్కలగండి ప్రాజెక్టుకు, దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. జిల్లాలో వెనుకబాటుతనాన్ని పారదోలి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అత్యధికంగా నష్టపోయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కనీవినీ ఎరుగని రీతిలో యాదాద్రి అభివృద్ధి చేయడం, ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగు నీరు అందించే వాటర్ గ్రిడ్ పథకం జిల్లా నుంచి ప్రారంభించడం, దామచర్లలో 6800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నెలకొల్పడం ద్వారా జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు తరలివచ్చి సీఎంకు మద్దతుగా నిలవాలని కోరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే కరెంట్ సమస్య ఉంటుందని పూర్వ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విష ప్రచారం చేశారని ఆరోపించారు. ఎలాంటి కరెంట్ సమస్య లేకుండా రైతాంగానికి కరెంట్, నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు కేవీ రామారావు, మైనం శ్రీనివాస్, మాలె శరణ్యారెడ్డి, ఫరుదుద్దీన్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీని జయప్రదం చేయాలి
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా ప్రతి నియోజకవర్గంనుంచి 300మందికి మించకుండా ప్లీనరీకి రావాలి బహిరంగ సభకు జిల్లా నుంచి లక్ష మంది తరలింపు నకిరేకల్ : ఈనెల 24న జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్లీనరీ, 27న జరిగే పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి కోరారు. నకిరేకల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మాట్లాడారు. ప్లీనరీకి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 300మందికి మించకుండా హాజరు కావాలని చెప్పారు. 27న జరిగే బహిరంగ సభలో జిల్లా నుంచి లక్ష మంది టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నల్లగొండ జిల్లా త్వరలోనే టీఆర్ఎస్కు పెట్టిన కోటగా మారబోతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా నాయకులు అమరేందర్‌రెడ్డి, పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, ఎం పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యానాల పాపిరెడ్డి, కోక యాదయ్య, టీఆర్ఎస్ మండల, పట్టణ శాఖ అధ్యక్షులు పల్రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
* ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ * అభ్యర్థిత్వంపై తొలగిన సందిగ్ధత * 25న నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు * మూడు జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ చర్చ సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ తన రెండో అభ్యర్థిని కూడా ప్రకటించింది. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గం నుంచి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈమేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. అంతకుముందు సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన క్యాంపు కార్యాలయంలో మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. మూడు జిల్లాలతో సంబంధమున్న నాయకుడు కావడం, తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకోవాల్సిన అవసరాన్నీ పరిగణనలోకి తీసుకుని రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దీనిపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే ప్రకటన వెలువడినట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన నల్లగొండ జిల్లా పార్టీ మాజీ కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా మాజీ కన్వీనర్ రవీందర్రావు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డిని కూడా హైదరాబాద్‌కు పిలిపించారు. మంత్రులతో భేటీ అయ్యాక వీరితో ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ మాట్లాడి బుజ్జగించినట్లు తెలిసింది. ఇప్పటికే ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి టీఎన్జీవో నేత దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇతరులకు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం మేరకు తొలుత బండా నరేందర్‌రెడ్డితో కేసీఆర్ వ్యక్తిగతంగా మాట్లాడారు. వివిధ రాజకీయ సమీకరణాలు, అవసరాలరీత్యా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలోకి దింపుతున్నామని, అంతా కష్టపడి ఆయనను గెలిపించుకురావాలని సూచించారు. అలాగే మార్చి తర్వాత కొన్ని కార్పొరేషన్ పదవులు అందుబాటులోకి రానున్నాయని, వాటిలో ఒక పదవిని ఇవ్వనున్నట్లు నరేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారని తెలిసింది. టికెట్ కోసం పట్టుబట్టిన మర్రి యాదవరెడ్డికీ సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆయనకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ పోస్టును ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాలతో యువతలోకి.. పట్టభద్రులకు ఏం కావాలో ప్రభుత్వానికి తెలుసునని, వారంతా టీఆర్ఎస్ వెనకే నిలవాలని రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారయ్యాక ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తనను ఎంపిక చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతోనే తెలంగాణ ఉద్యమం జరిగిందని, పట్టభద్రుల మనసు దోచుకునే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. యువత కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీ సహా మరెన్నో ప్రయోజనాలు చేకూర్చనుందన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత టీఆర్ఎస్ వెంట ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. 25వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం విద్యార్థుల ఖాతాల్లోకే వెళుతోందని వివరణ ఇచ్చారు. -
ఓటర్లుగా నమోదు చేయించాలి
హాలియా : దేశంలోని ఏదేని యూనివర్సిటీ నుంచి 2011 నాటికి డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం హాలియాలో జరిగిన సాగర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. పట్టభద్రుల నియోజకవర్గంలో గత ఎన్నికల నాటికి 1.34లక్షల మంది ఓటర్లు ఉండగా జిల్లాలో 47వేల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. పట్టభద్రులను గ్రామాలవారీగా గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపైనే ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని చెప్పారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తియాదవ్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మల్గిరెడ్డి లింగారెడ్డి, ఇస్లావత్ రాంచందర్ నా యక్, రావుల చినబిక్షం, మండల అధ్యక్షుడు రవి నాయక్, పగిళ్ల సైదులు, అనుముల శ్రీనివాసరెడ్డి, వర్రా వెంకట్‌రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బహునూతల నరేందర్ పాల్గొన్నారు. -
టీడీపీ నేతలకు సిగ్గూశరం లేదు
నల్లగొండ టుటౌన్ : తెలంగాణలో కరెంట్ కష్టాలకు ఏపీ సీఎం చంద్రబాబే కారణమని తెలిసినా ఆ పార్టీ నేతలు బుద్ధి, సిగ్గూశరం లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఆయన దుబ్బాక నర్సింహారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వారు ఏ విధంగా తిరగబడతారో ఇప్పటికైనా టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ నేతలకు పోలీసులు రక్షణ కల్పించకపోతే ప్రజలు తరిమికొట్టేవారని పేర్కొన్నారు. పంటలు ఎండి రైతులు నష్టపోతుంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని కృష్ణా బోర్డుకు చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రాజెక్టులో 838 అడుగుల నీరు ఉన్నంత వరకు ఉపయోగించుకోవచ్చని చంద్రబాబే జీఓ తెచ్చిన విషయం టీడీపీ నేతలు గమనించాలన్నారు. కేసీఆర్ కుటుంబంపై బూతులు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం తమకు వచ్చని, కానీ సంస్కారం అడ్డువస్తుందన్నారు. మోత్కుపల్లి మొరిగి, మొరిగి ఖమ్మం వెళ్లాడని, అక్కడి ప్రజలు కూడా చీదరించుకోవడంతో ఇక్కడి వచ్చాడని తెలిపారు. కరెంట్ కష్టాలకు చంద్రబాబు కారణమైతే ముక్కు నెలకు రాస్తానన్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కరెంట్ కష్టాలను తీసుకువచ్చింది ఎవరో తెలి యదా అని ప్రశ్నించారు. టీడీపీ వైపు ప్రజలు లేకపోవడంతోనే బంద్ ఘోరం గా విఫలమైందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సిం హారెడ్డి మాట్లాడుతూ కరెంట్ కోసం పోరాడితే బషీర్‌బాగ్‌లో ముగ్గురిని కాల్చి పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి ఆపేయడం చూసి తట్టుకోలేకనే నల్లగొండ నియోజకవర్గ రైతులు టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారన్నారు. టీడీపీ నేతలు ఇదే విధంగా వ్యవహరిస్తే హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంపైనే రైతులు దాడి చేస్తారని హెచ్చరించారు. కరెంట్ కష్టాలు సృష్టిస్తున్న టీడీపీ ఇక్కడ నిరసన సభ ఏలా నిర్వహిస్తారో చూస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు షేక్ కరీంపాష, జమాల్‌ఖాద్రీ, సైదులు, గణేష్ పాల్గొన్నారు. -
‘మోత్కుపల్లి’.. మానసిన వికలాంగుడు
నల్లగొండ :టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మానసిక వికలాంగుడిగా మారారని, తెలంగాణ రాష్ట్రంలో ఉంటూనే తెలంగాణ ద్రోహిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రాజ్యసభ సీటు కోసం.. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పదవి కోసం చాలా రోజుల తర్వాత చంద్రబాబు మెప్పుపొందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని అన్నారు. లోయర్ సీలేరులో పీపీఎ రద్దు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణా రైతులపై ప్రేమ ఉంటే చంద్రబాబుతో మాట్లాడి విద్యుత్ ఇప్పించే విధంగా ప్రయత్నించాలని హితవు పలికారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే చేయడం లేదని, ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తుంటే మోత్కుప ల్లికి కానరావట్లేదా.. అన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, ఆ పార్టీ నాయకులు బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, శివరామకృష్ణ, జమాల్‌ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.