టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
* ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’
* అభ్యర్థిత్వంపై తొలగిన సందిగ్ధత
* 25న నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు
* మూడు జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ చర్చ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ తన రెండో అభ్యర్థిని కూడా ప్రకటించింది. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గం నుంచి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈమేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. అంతకుముందు సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన క్యాంపు కార్యాలయంలో మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. మూడు జిల్లాలతో సంబంధమున్న నాయకుడు కావడం, తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకోవాల్సిన అవసరాన్నీ పరిగణనలోకి తీసుకుని రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. దీనిపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే ప్రకటన వెలువడినట్లు సమాచారం.
ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన నల్లగొండ జిల్లా పార్టీ మాజీ కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా మాజీ కన్వీనర్ రవీందర్‌రావు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డిని కూడా హైదరాబాద్‌కు పిలిపించారు. మంత్రులతో భేటీ అయ్యాక వీరితో ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ మాట్లాడి బుజ్జగించినట్లు తెలిసింది. ఇప్పటికే ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి టీఎన్జీవో నేత దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఇతరులకు నామినేటెడ్ పదవులు
ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం మేరకు తొలుత బండా నరేందర్‌రెడ్డితో కేసీఆర్ వ్యక్తిగతంగా మాట్లాడారు. వివిధ రాజకీయ సమీకరణాలు, అవసరాలరీత్యా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలోకి దింపుతున్నామని, అంతా కష్టపడి ఆయనను గెలిపించుకురావాలని సూచించారు. అలాగే మార్చి తర్వాత కొన్ని కార్పొరేషన్ పదవులు అందుబాటులోకి రానున్నాయని, వాటిలో ఒక పదవిని ఇవ్వనున్నట్లు నరేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారని తెలిసింది. టికెట్ కోసం పట్టుబట్టిన మర్రి యాదవరెడ్డికీ సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆయనకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ పోస్టును ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
ప్రభుత్వ పథకాలతో యువతలోకి..
పట్టభద్రులకు ఏం కావాలో ప్రభుత్వానికి తెలుసునని, వారంతా టీఆర్‌ఎస్ వెనకే నిలవాలని రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారయ్యాక ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తనను ఎంపిక చేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతోనే తెలంగాణ ఉద్యమం జరిగిందని, పట్టభద్రుల మనసు దోచుకునే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. యువత కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీ సహా మరెన్నో ప్రయోజనాలు చేకూర్చనుందన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత టీఆర్‌ఎస్ వెంట ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. 25వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం విద్యార్థుల ఖాతాల్లోకే వెళుతోందని వివరణ ఇచ్చారు.