ఓటర్లుగా నమోదు చేయించాలి
హాలియా : దేశంలోని ఏదేని యూనివర్సిటీ నుంచి 2011 నాటికి డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం హాలియాలో జరిగిన సాగర్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. పట్టభద్రుల నియోజకవర్గంలో గత ఎన్నికల నాటికి 1.34లక్షల మంది ఓటర్లు ఉండగా జిల్లాలో 47వేల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు.
పట్టభద్రులను గ్రామాలవారీగా గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపైనే ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహ్మయ్య మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని చెప్పారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తియాదవ్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు మల్గిరెడ్డి లింగారెడ్డి, ఇస్లావత్ రాంచందర్ నా యక్, రావుల చినబిక్షం, మండల అధ్యక్షుడు రవి నాయక్, పగిళ్ల సైదులు, అనుముల శ్రీనివాసరెడ్డి, వర్రా వెంకట్‌రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బహునూతల నరేందర్ పాల్గొన్నారు.