నల్లగొండ టుటౌన్ : జిల్లా అభివృద్ధికి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కళాశాలలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి కోరారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో ఆయన మాట్లాడుతూ 8న చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పథకానికి, నక్కలగండి ప్రాజెక్టుకు, దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
జిల్లాలో వెనుకబాటుతనాన్ని పారదోలి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అత్యధికంగా నష్టపోయిందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కనీవినీ ఎరుగని రీతిలో యాదాద్రి అభివృద్ధి చేయడం, ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగు నీరు అందించే వాటర్ గ్రిడ్ పథకం జిల్లా నుంచి ప్రారంభించడం, దామచర్లలో 6800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నెలకొల్పడం ద్వారా జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు తరలివచ్చి సీఎంకు మద్దతుగా నిలవాలని కోరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే కరెంట్ సమస్య ఉంటుందని పూర్వ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విష ప్రచారం చేశారని ఆరోపించారు. ఎలాంటి కరెంట్ సమస్య లేకుండా రైతాంగానికి కరెంట్, నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు కేవీ రామారావు, మైనం శ్రీనివాస్, మాలె శరణ్యారెడ్డి, ఫరుదుద్దీన్ పాల్గొన్నారు.
సీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలి
Published Thu, Jun 4 2015 11:55 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement