
సేంద్రీయ వ్యవసాయమే మేలు
ఘంటసాల : రసాయనిక వ్యవసాయం కంటే సేంద్రీయ వ్యవసాయమే మేలని పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఘంటసాలలో గురువారం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో వ్యవసాయ కళాశాల విద్యార్థినులతో రైతు సదస్సు నిర్వహించారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఏడీ డాక్టర్ పీఆర్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సారం, జీవకణాలు నశించిపోతున్నాయన్నారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల భూమి సారవంతం పెరిగి జీవకణాలు అభివృద్ధి చెంది అధిక దిగుబడి లభిస్తుందన్నారు. వ్యవసాయ కళాశాలల విద్యార్థినులు చదువుకున్న దాని కంటే క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పంట పొలాల్లో సంచరించాలని సూచించారు. రాబోయే కాలంలో రైతులకు తగిన సూచనలు ఇచ్చి పంట దిగుబడులు పెరిగేలా చూడాలన్నారు. రైతులు కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలన్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా అధిక దిగుబడి కోసం అధిక ఎరువులు వాడుతున్నారని, కానీ సేంద్రీయ వ్యవసాయమైన పశువుల ఎరువు, జీవామృతం, పచ్చిరొట్ట ఎరువులు వాడటం వల్ల నాణ్యమైన పోషక విలువలు కలిగిన పంటలను పండిచవచ్చన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే సేంద్రీయ వ్యవసాయం చేస్తామని తెలిపారు. నీటి కొరత వల్ల కొన్ని ప్రాంతాల్లో సకాలంలో పంటలు వేయలేకపోయారని, వారికి తగిన విత్తనాల రకాలు సూచించి, ఏయే పంటలు వేసుకోవాలో తెలియజేయాలని చెప్పారు. అనంతరం వ్యవసాయ కళాశాల విద్యార్థినులు తమ అనుభవాలను తెలియజేశారు. కార్యక్రమానికి ముందుగా రసాయనిక సేంద్రీయ వ్యవసాయం పై విద్యార్థినులు ప్రదర్శించిన నాటిక ఆకటుకోగా, స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం జేడీ యు.నరసింహారావు, పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త వైవీ ప్రసాద్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, కేవీకే కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ పి.శ్రీలత, డాక్టర్ జి.మానస, కె.రేవతి, ఎం.గౌతమ్, పీఎన్‌బీ శర్మ, బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులు, రైతులు పాల్గొన్నారు.