పక్కా ఇల్లు కలే
– జీవో నంబర్: 90తో ప్రతిబంధకాలు
– తాజాగా ఉత్తర్వులు జారీ
– 13 రకాల నిబంధనలు
పలమనేరు:నియోజకవర్గానికి 1,250 ఇళ్లు మంజూరయ్యాయి. ఒకో ఇంటి నిర్మాణానికి రూ.2.25 లక్షలు మంజూరు చేస్తారు. దీంతో అందిన ఆరు వేల దరఖాస్తుల్లో జే.బీ. కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో సంప్రదించి మూడు వేలు తిరస్కరించారు. మిగిలినవి ఆన్‌లైన్‌లో ఉంచారు. ఇప్పటికి ఒకటి కూడా మంజూరు చేయాలేదు.
జీ.వో ప్రకారం.. ఇవి ఉండకూడదు
జీవో మేరకు ఇల్లు నిర్మించుకోవడం సులభం కాదనే విషయం స్పష్పం అవుతోంది. ఇంట్లో ల్యాండ్‌ఫోన్, బైక్, మూడు, నాలుగు చక్రాల వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, కుటుంబంలో ఏ ఇక్కరికైనా నెలకు రూ. పది వేలకు మించి వేతనం రాకూడదు. బ్యాంకుల్లో 50 వేలకు పైగా ఎఫ్‌డీ ఉండకూడదు. మాగాణి 2.5 ఎకరాలు, మెట్ట 7.5 ఎకరాలుంటే అనర్హులు. అంతెందుకు ఇంట్లో ఫ్రిజ్ ఉంటే ఇల్లు రాదు.
వాస్తవమే...
ఆ మేరకు జీవో విడుదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తాం. ప్రాధమ్యాలను పరిగణలోకి తీసుకుని ఇల్లు మంజూరు చేస్తాం.
–అశోకచక్రవర్తి, హౌసింగ్ డీఈ
ఇంత అన్యాయమా
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్క పక్కా ఇల్లు మంజూరు చేయలేదు. మొన్న జరిగిన జన్మభూమిలో మాత్రం నాయకులు భారీగా అర్జీలను స్వీకరించారు. ఇప్పుడేమో నిబంధనలు కఠినతరం చేసి పేదలకు గూడు లేకుండా చేయడం సమంజసమేనా?
– చెన్నకేశవులు, సీపీఐ నాయకుడు
ముందుగానే చెప్పాలి
పక్కా ఇల్లు పొందాలంటే నిబంధనలు ఇలా ఉంటాయని ముందుగా చెప్పాల్సింది. అందరిదగ్గర అర్జీలు తీసుకుని వారికి ఆశలు కల్పించి ఇప్పుడేమో ఇలా మోకాలడ్డువేయడం సబబు కాదు. ప్రభుత్వం ఈ రకంగా విచారణ జరిపితే గ్రామానికి ఒక్కరికీ కూడా పక్కా ఇల్లు మంజూరు కాదేమో.
– రాధ, సర్పంచ్, జగమర్ల