రాంబాబును అభినందిస్తున్న పార్టీ నేతలు
శ్రీకాకుళం అర్బన్ : లోక్‌సత్తా మార్కు రాజకీయాలే రాష్ట్రాన్ని నిజమైన అభివృద్ధి వైపు నడిపిస్తాయని ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పంచాది రాంబాబు అన్నారు. శ్రీకాకుళంలోని రామలక్ష్మణ కూడలి వద్దనున్న క్రాంతి భవన్‌లో ఆదివారం లోక్‌సత్తా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు.
కేంద్రం ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా... అవి ప్రత్యేకSహోదాతో సరితూగవని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.పోలినాయుడు మాట్లాడుతూ పార్టీ భావజాలాన్ని యువతలోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఇటీవల రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన పంచాది రాంబాబును ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు అభినందించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.విష్ణుమూర్తి, జిల్లా కార్యదర్శి ఎం.సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎ.నాగేశ్వరరావు, బి.గౌరీశంకర్, ఆమదాలవలస, శ్రీకాకుళం, పలాస, నరసన్నపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల పార్టీ బాధ్యులు, సీనియర్ నాయకులు కె.అన్నంనాయుడు, వి.అప్పలరాజు, టి.మాధవరావు, ఆర్.గాంధీ తదితరులు పాల్గొన్నారు.