
బలి తీసుకున్న తూటా
ఉదయం సుమారు 6.30 గంటల సమయం.. అది పాడేరులోని ఏఎస్పీ కార్యాలయం..
తనువు చాలించిన యువ ఐపీఎస్ అధికారి
పాడేరు ఏఎస్పీ అనుమానాస్పద మరణం
తలలోకి దూసుకెళ్లిన 9ఎంఎం పిస్టల్ బుల్లెట్
2012లో పోలీసు శాఖలో చేరిక
తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు
రెండు నెలల్లో వివాహం.. అంతలోనే విషాదం
సంఘటన స్థలంలో సూసైడ్ నోట్?
గోప్యత పాటిస్తున్న పోలీసు యంత్రాంగం
దుర్ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం
ఉదయం సుమారు 6.30 గంటల సమయం.. అది పాడేరులోని ఏఎస్పీ కార్యాలయం.. పరిసరాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి.. ఉన్నట్టుండి ఏఎస్పీ చాంబర్ నుంచి తుపాకీ పేలిన శబ్దం ఆ ప్రశాంతతను చెదరగొట్టింది. బయట గదిలో ఉన్న హోంగార్డు తుళ్లిపడ్డాడు.. కంగారుగా లోపలికి పరిగెత్తుకెళ్లాడు.. లోపలి దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు.. కొద్దిసేపటి క్రితం.. తన ముందునుంచే లోపలికెళ్లిన తన బాస్ నెత్తుటిమడుగులో కుప్పకూలిన దృశ్యం చూసి భయకంపితుడయ్యాడు. వెంటనే పోలీసు అధికారులకు సమాచారమందించారు.బుల్లెట్ పొరపాటున దూసుకొచ్చిందో.. లేక ఆయనే దించుకున్నారో.. తెలియదు కానీ.. యువ ఐపీఎస్ అధికారి అయిన ఏఎస్పీ శశికుమార్ అర్ధంతరంగా తనువు చాలించారు. ఆయన గదిలో సూసైడ్ నోట్ లభించిందని అంటున్నా.. ఎవరూ ధ్రువీకరించడం లేదు. అయితే రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉన్న ఆయన ఇంతలోనే తనువు చాలించాలని ఎందుకనుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా.. ఒక్కగానొక్క కొడుకు తమను ఒంటరివాళ్లను చేసి వెళ్లిపోయాడని తమిళనాడు నుంచి వచ్చిన తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.
విశాఖపట్నం/పాడేరు: రైతు కుటుంబం నుంచి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన యువ అధికారి, పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్‌ను తూటా బలి తీసుకుంది. అది పొరపాటున బలి తీసుకుందా.. కావాలని ఆయనే బలి అయ్యారా? అన్నది తేలకపోయినా.. పోలీసు శాఖను, జిల్లా ప్రజలను కుదిపేసిన ఈ దారుణ ఘటన గురువారం ఉదయం పాడేరులో జరిగింది. మన్యంలో ఇలాంటి సంఘటన తొలిసారి చోటు చేసుకుంది.
ఏం జరిగింది?
ఈ ఏడాది జనవరి 6న పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శశికుమార్(28) అవివాహితుడు. తమిళనాడుకు చెందిన ఆయన పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో ఒంటరిగా ఉంటున్నారు. నివాస గృహం, కార్యాలయం ఒకేచోట ఉన్నాయి. గురువారం ఉదయం 6 నుంచి 6.15 గంటల మధ్య ఏఎస్పీ తన ఆఫీస్ చాంబర్‌లోకి వచ్చారు. కొద్దిసేపటికే గదిలో నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దాంతో బయట గదిలో ఉన్న హోంగార్డు లోపలికి పరుగెత్తుకెళ్లాడు. తూటా గాయంతో కిందపడి ఉన్న ఏఎస్పీని గుర్తించి ఎస్సై సూర్యప్రకాష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన వచ్చి శశికుమార్‌ను పోలీసు జీపులో పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉన్న ఆయన అక్కడ తుది శ్వాస విడిచారు. కుడి చెవి పైభాగం నుంచి ఎడమచేతి దిగువ భాగం వరకు బుల్లెట్ దూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఐటీడీఏ పీవో హరినారాయణన్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి తదితరులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శశి కుమార్ మృతదేహాన్ని పీవో హరినారాయణన్, ఎస్సై సూర్యప్రకాష్‌లు విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.
సంఘటన స్థలంలో కీలక ఆధారాలు
సంఘటన జరిగిన ఏఎస్పీ చాంబర్‌ను నర్సీపట్నం ఓఎస్‌డీ అట్టాడ బాబూజీ పరిశీలించారు. గోడపై బుల్లెట్ రంధ్రం పడిన ఆనవాళ్లు కనిపించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సంఘటన స్థలంలో ఏఎస్పీ శశికుమార్ ఉంచిన సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని, దాన్ని ఉన్నతాధికారులకు అందజేశారని సమాచారం. అయితే సంఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏఎస్పీ చాంబర్‌లోకి మీడియాను అనుమతించలేదు. క్లూస్ టీం వివరాలు సేకరించే వరకు లోపలికి వెళ్లరాదని కట్టడి చేశారు. పాడేరు పోలీసులు ఈ సంఘటనపై నోరు మెదపడం లేదు.
సీఐడీ విచారణ
ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. కేజీహెచ్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసు విచారణకు ప్రత్యేకాధికారిని నియమిస్తామన్నారు. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడును విచారణాధికారిగా నియమించారు.
విషాదంలో కుటుంబ సభ్యులు
శశికుమార్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగలం మండలం, రంగసముద్రం. ఆయనకు తల్లిదండ్రులు కుప్పుస్వామి, మైలమ్మాల్, సోదరి కవిత ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. విషాద వార్త తెలియగానే సోదరి కవిత తన భర్త పద్మనాభన్‌తో కలిసి చెన్నై నుంచి విశాఖ వచ్చారు. సాయంత్రానికి తల్లిదండ్రులు చేరుకున్నారు. కారు దిగుతూనే తల్లి మైలమ్మల్ బాధతో ముందుకు కదలలేకపోయారు. అతికష్టం మీద మార్చురీ వద్దకు వెళ్లిన ఆమె నిర్జీవంగా ఉన్న కుమారుడిని చూసి కళ్లుతిరిగి పడిపోయారు. మరో రెండు నెలల్లో ఆయనకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇంతలో ఇలా జరగడం వారిని తీవ్రంగా కలచివేసింది.
అధికారుల సందర్శన
ఏఎస్పీ మరణ వార్త తెలియగానే విశాఖ జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్, వుడా వీసీ టి.బాబూరావునాయుడు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, అడిషనల్ డీజీ సురేంద్రబాబు, ఐజీపీ (నార్త్ కోస్టల్ జోన్) కుమార్ విశ్వజిత్, ఐజీ బి.శ్రీనివాసులు, డీఐజీ శ్రీకాంత్, సీపీ యోగానంద్, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, జేసీపీ సత్తార్‌ఖాన్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ కె.రఘురామిరెడ్డి, విజయనగరం ఓఎస్‌డీ వెంకట అప్పలనాయుడు, పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్ధ కౌశిక్, పార్వతీపురం ఐటీడీఏ పీవో ప్రసన్న వెంకటేష్, పాడేరు సబ్ కలెక్టర్ శివశంకర్‌లతో పాటు ఉన్నతాధికారులు, సిబ్బంది కేజీహెచ్‌కు చేరుకున్నారు. దుర్ఘటనపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్భాంది వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన ఆయన బ్యాచ్ ఐపీఎస్ అధికారులు కూడా వచ్చి తమ సహచరుడిని కడసారి చూశారు.
వృత్తిలో నిబద్ధత
శశికుమార్ ఆళ్లగడ్డలో పనిచేసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలపై కఠినంగా వ్యవహరించారని పేరుంది. బదిలీపై పాడేరుకు వచ్చినప్పటి నుంచి ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై దృష్టి సారించారు. భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అరకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు చెందిన వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై కూడా రెండు రోజుల క్రితం కొత్తభల్లుగుడ గ్రామం వెళ్ళి విచారణ నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో, పాడేరులోని తన కార్యాలయంలో పని చేసే ఉద్యోగులతో కూడా ఆయన ఎంతో సామరస్యంగానే మెలిగేవారు. అలాంటి వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం డిపార్ట్‌మెంట్‌ను కలచివేస్తోంది.