నేనొస్తున్నా... మీరంతా రండి..
♦ గీత కార్మికులకు పిలుపు..
♦ 16న చిట్టాపూర్‌లో ‘సాక్షి’ హరితహారం
♦ ఇదో మంచి ప్రయత్నం
♦ ప్రశంసించిన మంత్రి పద్మారావుగౌడ్
గజ్వేల్ : ‘ విరివిగా ఈత వనాలు పెంచాల్సిన అవసరాన్ని ‘సాక్షి’ గుర్తుచేసింది. హరితహారంలో భాగంగా ఈనెల 16న దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఈత మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చింది. ఈత వనాలు నాటే కార్యక్రమానికి నేను వస్తున్నా.. మీరంతా రండి’ అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ గీత కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ మండలం పిడిచెడ్‌లో ఈత మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన మంత్రి ‘సాక్షి’ తో మాట్లాడుతూ... చిట్టాపూర్‌లో ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం స్ఫూర్తిదాయకమన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న హరితహారంలో ఈత వనాల పెంపునకు ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి ‘సాక్షి’ తమతో కలిసిరావడం ఆనందంగా ఉందన్నారు. గీత కార్మికుల ఉపాధి కోసం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం 50 వేల కల్లు దుకాణాలు ప్రారంభించినట్టు చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిహారం బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం స్పెషల్ గ్రాంటు నిధులు మంజూరు చేయనుందన్నారు.