సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ జె బ్రహ్మారెడ్డి
శ్రీకాకుళం సిటీ : జిల్లాలో (వైట్æకాలర్ అఫెన్స్) ఆర్థిక నేరాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, ఇటువంటి నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పారదర్శకంగా జరుగుతాయని, దళారుల మాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.
ఈ విషయంలో ప్రజల్లో అవగాహనæ కల్పించాలని సూచించారు. సివిల్ తగాదాలను క్రిమినల్ కేసులుగా నమోదు చేసే ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్లలో పలు కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలు, ఇతర ప్రోపర్టీని 15 నుంచి 30 రోజుల్లోగా సంబంధిత ఫిర్యాదుదారునికి లేదా యజమానికి అప్పగించాలన్నారు. ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో గ్రామాల్లో యువత, పెద్దలతో చర్చించి రికార్డింగ్ డ్యాన్సులు, అసభ్యకర నృత్యాలు జరగకుండా చూడాలన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగితే సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలదే బాద్యత అన్నారు. సమావేశంలో ఓఎస్‌డీ కె.తిరుమలరావు, డీఎస్పీలు కె.భార్గవరావునాయుడు, ఆదినారాయణ, సీహెచ్ వివేకానంద, పి.శ్రీనివాసరావు, వి.సుబ్రహ్మణ్యం, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.