
సరిహద్దు కేంద్రంగా చీకటి వ్యాపారం
♦ విచ్చలవిడిగా నిషేధిత పదార్థాల తరలింపు
♦ జోరుగా గుట్కాలు, మందు గుండు, నీలి కిరోసిన్, ఇతర నిషాపదార్థాల వ్యాపారం..
♦ అన్‌బ్రాండెడ్ తినుబండారాలు సైతం...!
ఇచ్చాపురం(కంచిలి): ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం పరిసరాలు చీకటి వ్యాపారాలకు కేరాఫ్‌గా మారాయి. రాత్రి వేళ నిషాపదార్థాలను గుట్టుగా జిల్లా అంతటా వ్యాపారులు సరఫరా చేస్తున్నారు. లారీలతో సరుకును డంప్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జరిపిన దాడిలో గుట్టలుగా బయటపడిన మత్తు పదార్థాలు, తయారీ యంత్రాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేయడం గమనార్హం.
తరలించేశారు..!
జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం పోలీసులు గుట్కా గొడౌన్లపై దాడి చేశారు. అయితే, దీనికి కొంత సమయం ముందు దాడి విషయం అక్రమార్కులకు తెలియడంతో లారీల్లో కొంత సరకును ఒడిశాకు తరలించినట్టు భోగట్టా. పోలీసులు 5 లారీల సరుకును మాత్రమే పట్టుకోగలిగారు. తర్వాత కొన్ని లారీలు సరకు దాటించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటుకల బట్టీల వద్ద రెండు లారీలు పట్టుబడినట్టు సమాచారం. గుట్కా వ్యాపారాన్నంతటినీ కొందరు బడాబాబుల అండతో బరంపురానికి చెందిన ‘పెదబాబు’ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పెదబాబును గుట్కా కేసులో ప్రథమ ముద్దాయిగా పేర్కొంటూ పోటీసులు కేసు చార్జిషీట్ తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పోలీసులు తీసుకునే ప్రతిచర్య ముందుగానే తెలుసుకొన్న పెదబాబు విదేశాలకు పారిపోయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గడచిన 15 రోజుల్లో గుట్కా నిల్వలే రూ.5 కోట్ల విలువైనవి లభ్యమయ్యాయంటే మిగతా వ్యాపారాలు ఇంకెంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గుట్కా నిల్వలు కోసం పోలీసులు జల్లెడపడడంతో సుమారు రూ.కోటి విలువైన శివకాశీ మందుగుండు సామగ్రి 520 ప్యాకెట్టు పట్టుబడింది. అక్రమ వ్యాపారం పెద్దఎత్తున వెలుగు చూడడంతో జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి రంగంలోకి దిగారు. బోర్డర్‌లోని ట్రాన్స్‌పోర్టర్లు, లారీ బ్రోకర్ కార్యాలయాలు, గొడౌన్ నిర్వాహకులతో సమావేశం పెట్టి అక్రమ వ్యాపారాలు నిర్మూలనకు సహకరించాలని కోరారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విచ్చలవిడిగా నీలికిరోసిన్ విక్రయం..
చౌకధరల దుకాణాల్లో విక్రయించే నీలికిరోసిన్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. లారీలకు డీజిల్‌కు బదులుగా నీలి కిరోసిన్‌ను వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. సరిహద్దులోని ఓ ఖాళీ గొడౌన్‌లో ఓ పార్టీకి చెందిన కార్యకర్త నేతల అండతో కిరోసిన్ మాఫియాను యథేచ్ఛగా సాగిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పిల్లలు తినే తినుబండారాలు కూడా చాలా వరకు అన్‌బ్రాండెడ్, రెండో క్వాలిటీవి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాలోని వివిధ ప్రాంతాలతోపాటు, ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. వివిధ రకాల బిస్కెట్లు, కుర్‌కురే పేరుతో రెండో రకం క్వాలిటీ సరకు ఇచ్ఛాపురం కేంద్రంగా రవాణా జరుగుతోంది. ఒడిశా పరిధిలోని సముద్ర తీర ప్రాంతం నుంచి నాటుసారా వ్యాపారం కూడా గుట్టుగా సాగుతోంది. అక్రమ వ్యాపారాలన్నీ ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లోని వివిధ రోడ్డు మార్గాల ద్వారా సాగుతున్నట్టు తెలుస్తోంది. వివిధ శాఖల ఉన్నతస్థాయి యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారిస్తే తప్ప ఇక్కడ అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి లేదని స్థానికుల మాట.