- రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం
- రెండు కిడ్నీలు పాడై మంచానికి పరిమితమైన కుటుంబ పెద్ద
మహాదాతలూ.. ఆదుకోండి
Published Sun, Nov 27 2016 11:57 PM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM
పెదపూడి :
అతను కూలికి వెళ్లందే కుటుంబ పోషణ జరగదు. రెండు కిడ్నీలు పాడై మంచానికి అతుక్కుపోయాడు. దాంతో ఆ కుటుంబం దిక్కుతోచక దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళితే.. వేండ్ర గ్రామానికి చెందిన ఆచంట వీర్రాజు కూలిపనికి వెళుతుంటాడు. అతనికి భార్య క్రాంతి, కుమారులు సంతోష్, హేమచంద్ర ఉన్నారు. ఆరు నెలల క్రితం వీర్రాజు తీవ్ర జ్వరం, దగ్గు, కఫంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి వెళితే రెండు కిడ్నీలు పాడైనట్టు వైద్యులు చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవా కార్డు ద్వారా డయాలసిస్ చేయించుకోవచ్చని కాకినాడలోని సిద్దార్ధ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ రక్తం తక్కువగా ఉందని చెప్పారు. దాంతో వైజాగ్‌లోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ డయాలసిస్‌కు ఫిస్టల్ వేయించుకోవాలని చెప్పారు. తక్షణం కిడ్నీలు మార్చాలని, లేకుంటే పరిస్థితి సీరియస్ అవుతుందని వైద్యలు చెప్పారు. దాంతో చేతిలో ఫిస్టల్ వేయించుకుని డయాలసిస్ చేయించుకుంటూ, దాతల సాయం కోసం ఎదురు చూస్తూ అక్కడే మూడు నెలలు ఉన్నాడు. అందినకాడికి అప్పులు చేసి సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితిలో స్వగ్రామానికి వచ్చేశాడు. ప్రస్తుతానికి వారానికి రెండుసార్లు కాకినాడలోని జీజీహెచ్‌లో డయాలసిస్ చేయించుకొని వస్తున్నాడు. కిడ్ని మార్పిడి ప్రక్రియకు మొత్తం సుమారు రూ.10లక్షల వరకు అవుతుందని వీర్రాజు, ఎవరైనా దాతలు కిడ్నీలు గానీ, ఆర్థికంగా సాయంచేసి ఆదుకోవాలని కోరుతున్నాడు. దాతలు మొబైల్ నంబర్ 9553099608ను సంప్రదించాలని కోరుతున్నాడు.
Advertisement