పోలవరం హెడ్‌వర్క్స్ ఏఈ సస్పెన్షన్
Published Sun, Jul 24 2016 4:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పనుల్లో అలసత్వం వహించిన హెడ్‌వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మునిరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ తాను చేపట్టిన సమీక్షలకు పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఎల్‌పీ షెడ్యూళ్లు, డిజైన్లు అందించడంలో జాప్యం చేస్తున్న గాయత్రి ఏజెన్సీ మరో 15 రోజుల్లో మెయిన్ కెనాల్ డిజైన్లు సమర్పించాలని, లేకుంటే ఏజెన్సీ తొలగిస్తామని కలెక్టర్ ఆ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం, తణుకు వంటి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రోడ్లను గుర్తించి నిర్మించాలని ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీర్‌ను కలెక్టరు ఆదేశించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, జేసీ–2 ఎంహెచ్. షరీఫ్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్, డీఆర్‌ఓ కె.ప్రభాకరరావు, నర్సాపురం సబ్ కలెక్టరు ఎ.ఎస్.దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ షాన్‌మోహన్, జిల్లా అధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement