వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ (చిత్రంలో నిందితులు), (ఇన్ సెట్లో) పోలీసులు స్వాధీనం చేసుకున్న నగలు
గ్యాంగ్‌గా ఏర్పాటు
‘మత్తుమందు’ దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు
పరారీలో తల్లి, భార్య
సొత్తు స్వాధీనం చేసున్న పోలీసులు
కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్
మేడ్చల్:
ఇంట్లో అద్దెకు దిగి యజమాని కుటుంబీకులకు మత్తు మందు ఇచ్చి దోపిడీలకు పాల్పడే గ్యాంగ్‌లో ఇద్దరు సభ్యులను మేడ్చల్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పేట్‌బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ మేడ్చల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్ల డించారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తన్నపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన గుంజి వెంకటేష్ అలియాస్ శ్రీను (25)తన భార్య దివ్య(22), తల్లి తిరుపతమ్మ(65) తదితరులు నల్లగొండ జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామానికి చెందిన దేవునూరి బాలయ్య(45)తో కలిసి ఓ గ్యాంగ్‌గా ఏర్పాటు చేసుకున్నాడు.
బాలయ్య వీరికి అద్దెకు గదులు చూస్తుండేవాడు. అందులో వెంకటేష్ కుటుంబీకులతో కలిసి దిగేవాడు. ఇంటి యజమాని, కుటుంబీకులకు అన్నం, కూర, కల్లు తదితర వాటిల్లో ఏదో ఒకదాంట్లో మత్తు పదార్థాలు కలిపి వారు అపస్మారకస్థితిలోకి వెళ్లగానే ఇంట్లోని సొత్తును అపహరించుకుపోయేవారు. ఈక్రమంలో గత నెల మండలంలోని పూడూర్ గ్రామానికి చెందిన తోకల రాము ఇంట్లో అద్దెకు దిగారు. 27వ తేదీన ఇంట్లో ఉన్న యజమాని రాములమ్మ, ఆమె కోడలు నీరజకు కాకరకాయ కూరలో మత్తు మందు కలిపి ఇచ్చారు. వారు అది తిన్న తర్వాత అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇంట్లో ఉన్న 9 తులాల బంగారు నగలను దోచుకుపోయారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో పోలీసులు బుధవారం ఉదయం శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ వద్ద వెంకటేష్, బాలయ్యను అరెస్ట్ చేయగా తిరుపతమ్మ, దివ్య పరారీలో ఉన్నారు. మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదల లో ఇదేవిధంగా వీరు ఇంటి యజమానికి కల్లులో మత్తుమందు కలిపి ఇచ్చి ఓ బంగారు మంగళసూత్రంతోపాటు ఓ బైక్‌ను అపహరించారు. ఈ చోరీ గత నెల 17న చేశారని ఏసీపీ వివరించారు. అయితే, వెంకటేష్‌పై సత్తన్నపల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు ఉందని తెలిపారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ పవన్ కుమార్ బృందాన్ని ఈసందర్భంగా ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో పోలీసులు 9 తులాల బంగారాన్ని రికవరీ చేశారు.