అనాథ మరణం.. కరిగిన పోలీస్ హృదయం
-
మృతదేహానికి అంత్యక్రియలు
-
ఔదార్యాన్ని చాటిన ట్రాఫిక్ ఎస్సై, సిబ్బంది
-
కొద్దినెలలుగా వృద్ధురాలికి భోజనం, ఇతర సౌకర్యాలు
నా అనేవారు లేని ఓ అనాథ వృద్ధురాలికి ఆమె జీవిత చరమాంకంలో ఓ ట్రాఫిక్ ఎస్సై పెద్ద కొడుకుగా నిలిచారు. కన్నవారినే సరిగ్గా పట్టించుకోని వారున్న నేటి కాలంలో రోడ్డు పక్కన కనిపించిన అవ్వను అక్కున చేర్చుకున్నాడు. భిక్షాటన చేసే ఓపిక కూడా లేని పండుటాకు ఆకలి బాధ తీర్చారు. అయితే కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లి మంగళవారం ఉదయం కన్నుమూసింది. చెమ్మగిల్లిన కళ్లతో సదరు ఎస్సై ఆమె అంత్యక్రియలను తోటి సిబ్బందితో కలిసి పూర్తి చేశారు. ఫ్రెండ్లీ పోలీస్‌కు అర్థం చాటి, మానవత్వానికి మచ్చు తునకగా నిలిచారు. ఈ ఘటన మహబూబాబాద్‌లో మంగళవారం జరిగింది. – మహబూబాబాద్
మానుకోటకు చెందిన నాగవెల్లి తిరుపతమ్మ(90) ఎలాంటి ఆధారం లేక మార్వాడి సత్రం బజారులోని ఓ గుమ్చీలో జీవనం సాగిస్తోంది. ఆమెకు నా అనే వారు ఎవరూ లేకపోవడంతో విషయం తెలుసుకున్న మానుకోట ట్రాఫిక్ ఎస్సై రవీందర్ గత కొన్ని నెలలుగా భోజనం, ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. అనారోగ్యానికి గురైనప్పుడు పలుమార్లు ఆస్పత్రిలో కూడా చూపించారు. కన్నతల్లిలాగా చూసుకున్న ఆ వృద్ధురాలి మరణవార్త మంగళవారం ఉదయం తెలియడంతో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. విధి నిర్వహణలో ఉండగా విషయం తెలియడంతో వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకొని కార్యక్రమాలను నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో పోలీసుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. పాడెను పోలీసులే కొంతదూరం మోసి ఆ తర్వాత ట్రాలీ ఆటోపై పట్టణ శివారులోని కంబాల్ చెరువు వద్దకు బ్యాండుమేళంతో తీసుకెళ్లారు. అనాథగా ఆ వృద్ధురాలు మృతిచెందినా అంత్యక్రియలకు పోలీసులు ముందుకు రావడంతో మార్వాడి సత్రం కాలనీవాసులతోపాటు ఇతరులు కూడా ముందుకొచ్చి ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై అంబటి రవీందర్‌ను ప్రతి ఒక్కరూ అభినందించారు. స్థానిక లాండ్రీ షాపు నిర్వాహకుడు యాకయ్య కుండపట్టగా, కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గండా పోతురాజు, గుండా మధూకర్, కారు డ్రైవర్లు బాలకిషన్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.