Traffic SI
-
ట్రావెల్ బస్సు చోరీకి యత్నం.. ఇలా దొరికిపోయాడు!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ద్విచక్ర వాహనాలు, ఆటోలను దొంగలించడం సర్వ సాధారణం. అయితే ఓ దొంగ ఏకంగా ట్రావెల్ బస్సునే చోరీకి యత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని సింధూర గెస్ట్‌హౌస్ పక్కన ట్రావెల్ బస్సును మంగళవారం రాత్రి డ్రైవర్ నిలిపి భోజనానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బస్సు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. అక్కడ అదృశ్యమైన బస్సు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. టౌన్‌కొత్తరోడ్డు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఉండడాన్ని స్థానికులు గుర్తించి, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాఫిక్ ఎస్ఐ కాళిదాసు, అదనపు ఎస్సై గణేష్, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తరలించారు. బస్సు ముందు భాగం నుజ్జు అయింది. బస్సును తస్కరించిన వ్యక్తి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పరారై ఉంటాడని ట్రాఫిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జంక్ సామ్రాజ్యం ‘సోటిగంజ్’.. చోర్ మాల్తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు -
ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, టీ.నగర్(చెన్నై): మైలాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. సైదాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ట్రాఫిక్ స్పెషల్ ఎస్ఐ బాలాజీ (50) నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలాజీ మధుమేహానికి చికిత్స పొందుతున్నారు. ఇలావుండగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనవసరంగా సెలవులు పెట్టరాదని డీజీపీ త్రిపాఠి ఉత్తర్వులిచ్చారు. దీంతో బాలాజీ సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు సమాచారం. సోమవారం ఉదయం మైలాపూర్ ఆలయంలో భద్రతా పనులు అప్పగించారు. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన బాలాజీ తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిభారం కారణమా? లేక కుటుంబ సమస్య? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఆన్లైన్ మోసం.. పోలీసులకే టోకరా..
విజయనగరం క్రైమ్: సైబర్ నేరగాళ్లు పోలీసుశాఖనూ వదిలి పెట్టడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని సెల్కే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన మెసెజ్‌లకు కనీసం వారికి ఫోన్ చేయకుండా ఏం ఇబ్బందుల్లో ఉన్నాడో అనుకుంటూ కేవలం చాటింగ్ మాత్రమే చేస్తూ డబ్బులు పంపించేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చివరికీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వారిని కూడా వదల్లేదు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆపదంటే ఆదుకునే మనసున్న వాళ్లు చాలామంది ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్తరకం పంథా మొదలెట్టేశారు. ఫేస్బుక్లో పోలీసులు, లాయర్లు, వైద్యుల పేర్లతో కొత్తగా పేజీలు సృష్టించడం.. అందులో ఉన్న వారికి ఫ్రెండ్స్ రిక్వెస్టులు పెట్టడం.. వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వారికి మెసెంజర్ ద్వారా అత్యవసరమంటూ రెండు, మూడు వేల రూపాయల సాయం చేయమనడం జరుగుతోంది. దీంతో చాలా మంది ఏదో అవసరం ఉంటుందులే అనుకుని పేటీమ్, ఫోన్‌పే ద్వారా పంపించేస్తున్నారు. ఈ కోవలోనే చాలా మంది పోలీస్ అధికారులు కూడా బలయ్యారు. రూ. లక్షల్లో సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. తాజాగా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై హరి పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా ప్రారంభించారు. అతని మిత్రులందరినీ నకిలీ ఖాతాలో యాడ్ చేసుకుని వారితో మెసెంజర్ ద్వారా చాట్ చేశారు. అర్జెంట్ అవరం ఉందని.. గంటలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించడంతో చాలా మంది ఫోన్‌పే, పేటీఎంల ద్వారా పంపించారు. అయితే ఫోన్ పేలో పేరు సరిగా లేకపోవడంతో ఒకరికి అనుమానం వచ్చి ఎస్సై హరికే నేరుగా ఫోన్ చేయడంతో ఆయన అవాక్కయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమందించి, ఆ ఖాతాను బ్లాక్ చేయించారు. ఎవ్వరూ డబ్బులు వేయవద్దని వాట్సాప్ ద్వారా మిత్రులందరికీ మెసెజ్‌లు పెట్టారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఎస్సై అర్జునరావుపై సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి : విజయవాడ బందరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను రక్షించిన రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అర్జునరావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఆయన సాహసాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం సీఎం జగన్ కాన్యాయ్ పైలెట్ ఆపీసర్గా విధులు నిర్వహిస్తున్న అర్జున రావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు రికమెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం లక్మీ అనే మహిళ కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న అర్జునరావు దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. మహిళను కాపాడడమే కాకుండా ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఎస్సై అర్జునరావును పోలీసు ఉన్నతాధికారులు సైతం అభినందిస్తున్నారు. -
ట్రాఫిక్ ఎస్సై ధైర్యసాహసాలు.. ప్రశంసలు!
సాక్షి, విజయవాడ: ఓ ట్రాపిక్ ఎస్సై ధైర్యసాహసాలు ప్రదర్శించి.. చురుగ్గా స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. సమయానుకూలంగా ధైర్యసాహసాలతో వ్యవహరించి.. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన ట్రాఫిక్ ఎస్సై అర్జునరావుపై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సాహసాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేకంగా కొనియాడారు. మహిళను కాపాడడమే కాకుండా ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఎస్సై అర్జునరావుకు అభినందనలు తెలిపారు. ఆయన పేరును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు. -
ఎస్ఐ ఓవర్‌యాక్షన్ !
అనంతపురం సెంట్రల్: ట్రాఫిక్ ఎస్ఐ రెచ్చిపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వాహనదారునిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఈ ఘటన మంగళవారం రాత్రి పీటీసీ సమీపంలోని ఫ్లైఓవర్‌పై చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు... అనంతపురంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్న నారాయణరెడ్డి కుమారుడు లక్ష్మీకాంతరెడ్డి వ్యక్తిగత పనిపై కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటలకు పీటీసీ సమీపంలోని ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా కారు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో కొంత ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఎస్ఐ శేషగిరి అక్కడికి చేరుకుని లక్ష్మీకాంతరెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పొరపాటు జరిగింది. వదిలేయండి అంటూ ప్రాధేయపడినా వినలేదు. జరిమానా వేయడంతో.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిమానా రుసుం చెల్లిస్తానని లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. దీంతో ఎస్ఐ శేషగిరి రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా భౌతిక దాడికి దిగారు. తాను చేసిన తప్పేమిటంటూ అడుగుతున్నా వినకుండా దాడి చేసినట్లు బాధితుడు వాపోయారు. మనస్థాపానికి గురైన బాధితుడు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఎస్ఐ శ్రీరామ్ రాయబారం ఘటన విషయం ఉన్నతాధికారులకు తెలియకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన టూటౌన్ ఎస్ఐ శ్రీరామ్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితునితో చర్చించారు. అతనికి దగ్గర బంధువైన మరో లీడర్ ద్వారా రాజీ చేయించి, వెనువెంటనే డిశ్చార్జి అయ్యేలా రాయబారం నడిపారు. తప్పు చేయనప్పుడు అంత వేగంగా సంప్రదింపులు చేయాల్సిన అవసరం పోలీసులకేముందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మర్యాదగా మాట్లాడుకుందాం... ఫ్రెండ్లీ పోలీసులు అనే పదాలు పేరుకు మాత్రమే అన్న ధోరణి పోలీసుల్లో వ్యక్తమవుతోందని ఈ సందర్భంగా పలు వురు వ్యాఖ్యానించారు. దీనిపై ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణయ్యను వివరణ కోరేందుకు యత్నిం చగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
డ్రంక్ అండ్ డ్రైవ్.. ట్రాఫిక్ ఎస్సై అత్యుత్సాహం!
-
లారీ డ్రైవర్‌పై ట్రాఫిక్ ఎస్సై లాఠీయిజం
-
ట్రాఫిక్ ఎస్సై లాఠీయిజం
♦ కానిస్టేబుల్‌ను ఢీకొట్టబోయి ఆగిన లారీ ♦ ఆగ్రహించిన ట్రాఫిక్ ఎస్సై ♦ లారీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదిన వైనం సిరిసిల్ల టౌన్: లాఠీ కోసం రోడ్డుపైకి హఠాత్తుగా వచ్చిన కానిస్టేబుల్‌ను ఢీకొనకుండా ఒక్కసారిగా బ్రేక్‌వేసి ప్రాణాపాయం నుంచి రక్షించిన ఓ లారీ డ్రైవర్‌ను అభినందించాల్సింది పోయి ట్రాఫిక్ ఎస్సై.. ఆగ్రహంతో ఊగిపోయారు. తన లాఠీతో 15 నిమిషాలపాటు డ్రైవర్‌ను చితకబాదారు. పట్టపగలు.. నడిరోడ్డుపై.. ప్రజలు చూస్తుండగానే అతడిని తీవ్రంగా కొట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ ఎస్సై లింగమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇరుకైన ఆ రోడ్డుగుండా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా.. వారిని ఆపేందుకు కానిస్టేబుల్ యత్నించారు. భయపడిన ఆ యువకులు బైక్‌ను ఆపకుండా వెళ్లారు. దీంతో డిస్ట్రిక్ట్ గార్డు షబ్బీర్ ఆగ్రహంతో లాఠీని వారిపైకి విసిరినా.. వారు తప్పించుకుపోయారు. అదే సమయంలో టీఎస్16 యూబీ 1012 నంబరు గల లారీ అటుగా వస్తోంది. ఆ లారీని చూడకుండా షబ్బీర్ రోడ్డుపై పడిన లాఠీని తీసుకునేందుకు వంగారు. ఎదురుగా వాహనాలు ఉండడంతో లారీ డ్రైవర్ మోహన్ సైతం షబ్బీర్‌ను గమనించలేకపోయాడు. స్థానికుల అరుపుతో మోహన్ అప్రమత్తమై సడన్ బ్రేక్‌తో లారీని ఆపాడు. అప్పటికే షబ్బీర్ లారీని గుర్తించి క్షణాల్లో రోడ్డుపైకి పడుకోవడంతో, లారీ కిందకు చొచ్చుకుపోయినా అదృష్టవశాత్తు బతికిపోయాడు. అయితే, కానిస్టేబుల్ చనిపోయాడని భావించిన మోహన్ పారిపోతుండగా పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. అంతే.. ఇక ఎస్సై లింగమూర్తి వచ్చి ఆ డ్రైవర్‌ను నానాబూతులు తిడుతూ, కాలితో తన్నుతూ, లాఠీతో చితక్కొట్టారు. ఈయనకు మరో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు జత కలిశారు. పోలీసులపైకే లారీ తీసుకొస్తావా? అని ఊగిపోతూ 15 నిమిషాలపాటు ఆ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి జీపులోకి ఎక్కించి, ఠాణాకు తరలించారు. -
అనాథ మరణం.. కరిగిన పోలీస్ హృదయం
మృతదేహానికి అంత్యక్రియలు ఔదార్యాన్ని చాటిన ట్రాఫిక్ ఎస్సై, సిబ్బంది కొద్దినెలలుగా వృద్ధురాలికి భోజనం, ఇతర సౌకర్యాలు నా అనేవారు లేని ఓ అనాథ వృద్ధురాలికి ఆమె జీవిత చరమాంకంలో ఓ ట్రాఫిక్ ఎస్సై పెద్ద కొడుకుగా నిలిచారు. కన్నవారినే సరిగ్గా పట్టించుకోని వారున్న నేటి కాలంలో రోడ్డు పక్కన కనిపించిన అవ్వను అక్కున చేర్చుకున్నాడు. భిక్షాటన చేసే ఓపిక కూడా లేని పండుటాకు ఆకలి బాధ తీర్చారు. అయితే కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లి మంగళవారం ఉదయం కన్నుమూసింది. చెమ్మగిల్లిన కళ్లతో సదరు ఎస్సై ఆమె అంత్యక్రియలను తోటి సిబ్బందితో కలిసి పూర్తి చేశారు. ఫ్రెండ్లీ పోలీస్‌కు అర్థం చాటి, మానవత్వానికి మచ్చు తునకగా నిలిచారు. ఈ ఘటన మహబూబాబాద్‌లో మంగళవారం జరిగింది. – మహబూబాబాద్ మానుకోటకు చెందిన నాగవెల్లి తిరుపతమ్మ(90) ఎలాంటి ఆధారం లేక మార్వాడి సత్రం బజారులోని ఓ గుమ్చీలో జీవనం సాగిస్తోంది. ఆమెకు నా అనే వారు ఎవరూ లేకపోవడంతో విషయం తెలుసుకున్న మానుకోట ట్రాఫిక్ ఎస్సై రవీందర్ గత కొన్ని నెలలుగా భోజనం, ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. అనారోగ్యానికి గురైనప్పుడు పలుమార్లు ఆస్పత్రిలో కూడా చూపించారు. కన్నతల్లిలాగా చూసుకున్న ఆ వృద్ధురాలి మరణవార్త మంగళవారం ఉదయం తెలియడంతో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. విధి నిర్వహణలో ఉండగా విషయం తెలియడంతో వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకొని కార్యక్రమాలను నిర్వహించారు. సంప్రదాయ పద్ధతిలో పోలీసుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. పాడెను పోలీసులే కొంతదూరం మోసి ఆ తర్వాత ట్రాలీ ఆటోపై పట్టణ శివారులోని కంబాల్ చెరువు వద్దకు బ్యాండుమేళంతో తీసుకెళ్లారు. అనాథగా ఆ వృద్ధురాలు మృతిచెందినా అంత్యక్రియలకు పోలీసులు ముందుకు రావడంతో మార్వాడి సత్రం కాలనీవాసులతోపాటు ఇతరులు కూడా ముందుకొచ్చి ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై అంబటి రవీందర్‌ను ప్రతి ఒక్కరూ అభినందించారు. స్థానిక లాండ్రీ షాపు నిర్వాహకుడు యాకయ్య కుండపట్టగా, కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గండా పోతురాజు, గుండా మధూకర్, కారు డ్రైవర్లు బాలకిషన్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీ దుస్తుల్లో దాగిన కరుణ
బెంగళూరు : పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఓ ట్రాఫిక్ ఎస్ఐ తన సమయ స్ఫూర్తితో కాపాడి... ఖాకీ దుస్తుల్లో కూడా కరుణ దాగి ఉంటుందని నిరూపించాడు. బెంగళూరులోని బ్యాటరాయణపుర సర్కిల్ ప్రాంతంలో గురువారం ఉదయం ట్రాఫిక్ ఎస్ఐ గోపాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు... ఆ సమయంలో తమిళనాడుకు చెందిన నిండు గర్భిణి సెల్వి అటుగా వెళుతూ పురుటి నొప్పులతో రహదారిపై కుప్పకూలిపోయింది. ఆ విషయాన్ని గమనించిన గోపాలకృష్ణ వెంటనే 108కి ఫోన్ చేశారు. అయితే ఆ వాహనం రావడం ఆలస్యమైంది. సెల్వికి పురిటి నొప్పులు మరింత ఎక్కువ కావడంతో గోపాలకృష్ణ పరుగుపరుగునా పరిగెత్తి సమీపంలో ఉన్న మహిళా పౌర కార్మికులు స్థానికంగా ఉన్న మహిళలను పిలుకువచ్చారు. అలాగే స్థానికుల నుంచి దుస్తులు సేకరించి... నాలుగు వైపులా కట్టేశారు. అనంతరం స్థానిక మహిళలు సెల్వీకి పురుడు పోశారు. సెల్వీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం అక్కడకు 108 చేరుకుంది. ఆ వాహనంలో వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. వెంటనే స్పందించి... తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన గోపాలకృష్ణను ఉన్నతాధికారులతోపాటు స్థానికులు అభినందించారు. -
చలాన్ రాశాడని ట్రాఫిక్ ఎస్సైపై దాడి
లంగర్‌హౌస్ (హైదరాబాద్) : విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సైపై మళ్లీ దాడి జరిగింది. కొద్ది నెలల్లోనే వివిధ ప్రాంతాల్లో ఈ ఎస్సైపైనే దాదాపు 20 సార్లకు పైగా దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. లంగర్‌హౌస్ పోలీసుల కథనం ప్రకారం... టి.మధు టోలీచౌకీ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్నారు. శనివారం ఈయన మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. కాగా మధ్యాహ్నం సమయంలో గుడిమల్కాపూర్ వైపు నుంచి ఓ లారీ అత్తాపూర్ వైపు వెళ్తోంది. ఎస్సై మధు ఆ లారీని ఆపారు. ప్రవేశం లేని సమయంలో లారీతో ఈ రోడ్డుపైకి ఎలా వచ్చావని డ్రైవర్‌ను ప్రశ్నించి, రూ.1100 చలాన్ విధించారు. అంతలోనే లారీ యజమాని సయ్యద్ హరీషుద్దీన్ అక్కడకు చేరుకుని ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. 'మా లారీలను పార్కు చేసే ప్రాంత సమీపానికి వచ్చి చలాన్లు రాసి వేధిస్తావా?' అని దుర్భాషలాడి ఎస్సైపై దాడి చేశాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపారి కంట్లో పెన్నుతో పొడిచిన టాఫిక్ ఎస్సై
రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ పోలీసులు భారీ వడ్డనలే కాదు.. భౌతిక దాడులు చేయడంలోనూ సత్తా చూపుతున్నారు. దుకాణం ఎదుట వినియోగదారులు వాహనాలు నిలిపిన పాపానికి దుకాణదారుపై ఓ ట్రాఫిక్ ఎస్సై దురుసుగా వ్యవహరించాడు. నోటీసులో రాసేందుకు తండ్రి పేరుకు స్పెల్లింగ్ తెలియదన్నందుకు చలాన్లు రాసే పెన్నుతో దుకాణదారుని కంటికింద పొడిచి వీరంగం సృష్టించాడు. ఈ ఉదంతం సైబరాబాద్ కమిషనరేట్‌లోని మాదాపూర్ ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కొత్తగూడకు చెందిన బి.రాకేష్ పటేల్(35) స్థానికంగా శ్రీబాలాజీ స్వీట్‌హౌస్ నిర్వహిస్తున్నాడు. సమీపంలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు షాపుఎదుటే వాహనాలు నిలిపారు. శనివారం సాయంత్రం కానిస్టేబుల్‌తో కలిసి అక్కడికొచ్చిన మాదాపూర్ ట్రాఫిక్ ఎస్సై బాలునాయక్ నో పార్కింగ్‌లో వాహనాల నిలపడంపై మండిపడ్డారు. నోటీసులో రాసేందుకు తండ్రి పేరు అడగ్గా.. షాపుయజమాని బవర్లాల్ అని చెప్పారు. ఆంగ్లంలో స్పెల్లింగ్ అడగడంతో తనకు చదువురాదని రాకేష్ చెప్పారు. దీంతో విచక్షణ కోల్పోయిన బాలునాయక్ పెన్నుతో రాకేష్ ఎడమకంటి కిందిభాగంలో పొడవడంతో అతనికి రక్తస్రావమైంది. ఎస్సైకు కానిస్టేబుల్ తోడై రాకేష్‌ను చితకబాదారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగడంతో ఖాకీలిద్దరూ జారుకున్నారు. స్థానికులు కొత్తగూడ జంక్షన్లో గంటకుపైగా రాస్తారోకో చేశారు. ఫలితంగా కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రాకేష్ స్థానికుల సాయంతో మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్సై బాలునాయక్‌పై కేసు నమోదు చేశారు.