వ్యాపారి కంట్లో పెన్నుతో పొడిచిన టాఫిక్ ఎస్సై
రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ పోలీసులు భారీ వడ్డనలే కాదు.. భౌతిక దాడులు చేయడంలోనూ సత్తా చూపుతున్నారు. దుకాణం ఎదుట వినియోగదారులు వాహనాలు నిలిపిన పాపానికి దుకాణదారుపై ఓ ట్రాఫిక్ ఎస్సై దురుసుగా వ్యవహరించాడు. నోటీసులో రాసేందుకు తండ్రి పేరుకు స్పెల్లింగ్ తెలియదన్నందుకు చలాన్లు రాసే పెన్నుతో దుకాణదారుని కంటికింద పొడిచి వీరంగం సృష్టించాడు. ఈ ఉదంతం సైబరాబాద్ కమిషనరేట్‌లోని మాదాపూర్ ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
కొత్తగూడకు చెందిన బి.రాకేష్ పటేల్(35) స్థానికంగా శ్రీబాలాజీ స్వీట్‌హౌస్ నిర్వహిస్తున్నాడు. సమీపంలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు షాపుఎదుటే వాహనాలు నిలిపారు. శనివారం సాయంత్రం కానిస్టేబుల్‌తో కలిసి అక్కడికొచ్చిన మాదాపూర్ ట్రాఫిక్ ఎస్సై బాలునాయక్ నో పార్కింగ్‌లో వాహనాల నిలపడంపై మండిపడ్డారు.
నోటీసులో రాసేందుకు తండ్రి పేరు అడగ్గా.. షాపుయజమాని బవర్‌లాల్ అని చెప్పారు. ఆంగ్లంలో స్పెల్లింగ్ అడగడంతో తనకు చదువురాదని రాకేష్ చెప్పారు. దీంతో విచక్షణ కోల్పోయిన బాలునాయక్ పెన్నుతో రాకేష్ ఎడమకంటి కిందిభాగంలో పొడవడంతో అతనికి రక్తస్రావమైంది. ఎస్సైకు కానిస్టేబుల్ తోడై రాకేష్‌ను చితకబాదారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగడంతో ఖాకీలిద్దరూ జారుకున్నారు. స్థానికులు కొత్తగూడ జంక్షన్‌లో గంటకుపైగా రాస్తారోకో చేశారు. ఫలితంగా కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రాకేష్ స్థానికుల సాయంతో మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్సై బాలునాయక్‌పై కేసు నమోదు చేశారు.